ప్రధానికి థ్యాంక్స్ చెప్పిన బండి సంజయ్

ప్రధానికి థ్యాంక్స్ చెప్పిన బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: నేషనల్ ​హైవే 563లో కరీంనగర్ – వరంగల్ మధ్య రెండు లేన్ల రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించే పనులను ప్రారంభించేందుకు అంగీకరించిన ప్రధాని మోదీకి కరీంనగర్ ​ఎంపీ బండి సంజయ్​ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 8న వరంగల్ పర్యటనలో ప్రధాని ఈ పనులకు శంకుస్థాపన చేస్తారని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 68.015 కిలో మీటర్లు ఫోర్​ లేన్ విస్తరణ పనులు చేపట్టనున్నారు. భారత్​మాల పరియోజన పథకం కింద కేంద్రం రూ.2,146 కోట్లతో ఈ పనులు చేపట్టింది. మొత్తం 30 గ్రామాలు కవర్ అయ్యేలా ఈ రహదారి విస్తరణ పనులు కొనసాగనున్నాయి. ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న ఈ రోడ్డును విస్తరించాలని ప్రధాని, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ, హైవే అధికారులను సంజయ్ కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని ప్రధానిని సంజయ్ కోరగా ఆయన అంగీకరించారు.  

కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్​కు శుభాకాంక్షలు

బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ  కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బుధవారం  ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘అనుభవజ్ఞులైన, సమర్థులైన మీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుంది. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మీరు కృషి చేస్తారని ఆశిస్తున్నాను’ అని బుధవారం ట్వీట్ చేశారు.  

ట్విట్టర్ ఖాతా అప్ డేట్

బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత సంజయ్ తన ట్విట్టర్ ఖాతాను అప్​డేట్ చేశారు. ట్విట్టర్ ఖాతాలో పార్టీ కార్యకర్త, కరీంనగర్ ఎంపీ , పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో మెంబర్ అని మార్చుకున్నారు.