- జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.
సోమవారం లోక్‌సభప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జాజుల బహిరంగ లేఖ విడుదల చేశారు. జనాభా దామాషా ప్రకారం ‘ఎవరి వాటా వారికి’ అనే రాహుల్ గాంధీ నినాదాన్ని తెలంగాణలో ఆచరణలో చూపాలని, రాష్ట్రాన్ని సామాజిక న్యాయానికి ఒక మోడల్‌గా తీర్చిదిద్దాలని కోరారు. త్వరలో భర్తీ చేయబోయే రెండు రాజ్యసభ స్థానాల్లో ఒకటి బీసీలకు, మరొకటి ఎస్సీ/ఎస్టీలకు కేటాయించాలని తెలిపారు. జనాభా ప్రాతినిధ్యం కంటే ఎక్కువగా రాజకీయ పదవుల్లో ఉన్న అగ్రకులాలకు మళ్ళీ అవకాశం ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.
