- 15 మంది భారతీయ సిబ్బందికి తప్పిన ముప్పు..
అయతుల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. దాడి సమయంలో ట్యాంకర్‌పై 15 మంది భారతీయులు, ఐదుగురు ఇతరులు ఉన్నారు. విషయం తెలిసి ఒమన్ ఆర్మీ ట్యాంకర్ సిబ్బందిని సురక్షితంగా తీరం చేర్చింది.
టెహ్రాన్: అంతర్జాతీయంగా చమురు సరఫరాకు కేంద్రమైన హార్మూజ్ జలసంధి భగ్గుమన్నది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా హతమార్చడంతో, దానికి ప్రతీకారంగా ఇరాన్ విరుచుకుపడుతున్నది. ఈ క్రమంలోనే ఒమన్ తీరానికి సమీపంలోని వ్యూహాత్మక హార్మూజ్ జలసంధి గుండా వెళ్తున్న ఒక ఆయిల్ ట్యాంకర్‌పై దాడి చేసింది. పలావు దేశపు జెండాతో ప్రయాణిస్తున్న ‘స్కైలైట్’ అనే ఆయిల్ ట్యాంకర్‌పై ఒమన్‌లోని ముసందమ్ ద్వీపకల్పం సమీపంలో ఈ దాడి జరిగింది.
దాడి జరిగిన సమయంలో ఆయిల్ ట్యాంకర్‌పై మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది భారతీయులు, ఐదుగురు ఇరాన్ పౌరులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో కనీసం నలుగురు గాయపడినట్లు ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ (ఎంస్‌సీ) ధృవీకరించింది. ఖసాబ్ పోర్టుకు కేవలం 5 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది.
ప్రమాదం జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఒమన్ భద్రతా దళాలు సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయించాయి. గాయపడిన నలుగురికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ దాడికి ముందు ఒమన్‌లోని ‘దుక్మ్’ పోర్టుపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి.
ఆందోళనలో గ్లోబల్ ఆయిల్ మార్కెట్..
హార్మూజ్.. అరేబియా సముద్రంలో ఒమన్‌కు చెందిన ముసాండం ద్వీపకల్పం–-ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి. ఇందులో రెండు షిప్పింగ్ లేన్లు ఉన్నాయి. క్రూడ్ క్యారియర్లు సులువుగా ప్రయాణించగలుగుతాయి. ఈ మార్గం నుంచి నిత్యం 2 కోట్ల పీపాల క్రూడ్ ఆయిల్ వివిధ దేశాలకు వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా వినియోగించే చమురులో ఐదో వంతు ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ‘చోక్ పాయింట్’.
ఇరాన్ నౌకాదళం నుంచి వచ్చిన రేడియో హెచ్చరికల ప్రకారం.. ఈ ఇరుకైన మార్గం గుండా ఏ నౌకను వెళ్లనిచ్చేది లేదని వారు ప్రకటించారు. అమెరికా-–ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా చరిత్రలోనే అత్యంత భయంకరమైన సైనిక చర్యను ప్రారంభించబోతున్నట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించారు. తాజా పరిణామాలతో షిప్పింగ్ కంపెనీలు, బీమా సంస్థలు, గ్లోబల్ ఆయిల్ మార్కెట్ తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఒమన్ పరిసర ప్రాంతాల్లో ఇరాన్ నేరుగా లక్ష్యాలను తాకడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం
