మల్కాజిగిరి, వెలుగు: కుషాయిగూడలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. స్థానిక వ్యాపారవేత్త జి. ఆనంద్ గుప్తా ఇంట్లో శనివారం ఎవరూ లేని సమయంలో దుండగులు చొరబడి బీరువాలోని 40 తులాల బంగారం, 3.7 కిలోల వెండి, రూ.2.40 లక్షల నగదు ఎత్తుకెళ్లారు.
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ గౌడ్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దొంగిలించిన సొత్తులో అత్యధిక భాగాన్ని రికవరీ చేసినట్లు పోలీసులు సమాచారం. ఈ కేసు వివరాలను పోలీసులు సోమవారం వెల్లడించనున్నారు.
