- మూసీ రివర్ ఫ్రంట్ పేరిట లక్షన్నర కోట్ల స్కామ్ చేస్తున్నారని ఆరోపణ
- మూసీ బాధిత కుటుంబాలపై బెదిరింపులు ఆపాలని డిమాండ్
- హైదర్ షా కోట, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ బాధితులతో భేటీ
హైదరాబాద్ సిటీ/రాజేంద్రనగర్, వెలుగు: రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్టులో భాగంగా ఇండ్లు, భూములు, అపార్ట్‌మెంట్లు కోల్పోతున్న రాజేంద్రనగర్‌లోని హైదర్ షా కోట, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులను ఆదివారం కలిసి సంఘీభావం తెలిపారు. మూసీ బాధితుల కోసం నిర్వహించిన ‘మూసీ దండి మార్చ్’పాదయాత్రలో మూడున్నర కిలోమీటర్లలో బాధితులను కలుస్తూ ముందుకు సాగారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ దగ్గర జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘దేశంలో బీజేపీ బుల్డోజర్ రాజ్యం నడిపిస్తుందంటూ.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇతర నేతలు విమర్శిస్తుంటే, తెలంగాణలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం, అరాచకాలు మాత్రం వారికి కనబడటం లేదు. సీఎం రేవంత్ రెడ్డి పంపిస్తున్న డబ్బు సంచుల కోసం మౌనంగా చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి తెలిసిన పాలన కేవలం ఇండ్లను కూలగొట్టడం, భూములు ఆక్రమించడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం మాత్రమే.. దాని కోసం పేదల జీవితాలను నాశనం చేస్తున్నరు’’అని కేటీఆర్ మండిపడ్డారు.
ప్రజల ఇండ్లు కూలగొట్టి రియల్ ఎస్టేటా?
ప్రజల ఇండ్లను కూలగొట్టి సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క ఇల్లు, రోడ్డు, ప్రాజెక్టు కట్టకుండా.. విధ్వంసమే విధానంగా పెట్టుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూసీ కోసం ఎవరి భూములు, ఇండ్లు పోకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.
రాష్ట్ర సీఎం కోసం ఇప్పటికే ప్రగతి భవన్ సిద్ధంగా ఉందని, దానిని కాదని రూ.200 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి తన కోసం ప్రత్యేక ఇల్లు కట్టుకుంటున్నాడని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం రూ.16 వేల కోట్లతోనే మూసీ సుందరీకరణ కార్యక్రమాన్ని ఒక్క ఇల్లు పోకుండా డీపీఆర్ సిద్ధం చేశామని తెలిపారు. దానిని పక్కనపెట్టి రూ.లక్షన్నర కోట్ల దోపిడీ కోసం వేల మంది ఇండ్లను ధ్వంసం చేస్తూ రేవంత్ రెడ్డి కొత్త స్కామ్‌కి తెరలేపారని ఆరోపించారు.
కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా?
మూసీ బఫర్ జోన్‌కి సంబంధించి అనేక మాటలు చెబుతున్న కాంగ్రెస్ సర్కార్, అధికారంలో ఉన్నప్పుడు ఇదే అపార్ట్‌మెంట్లకు పర్మిషన్ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఆనాడు అనుమతులు ఇచ్చిన కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొట్టాలా? అని ప్రశ్నించారు. మరోవైపు, మూసీలో ఇండ్లు ఉన్నాయని అబద్ధాలు చెప్తూ ధ్వంసం చేస్తున్న రాష్ట్ర సర్కార్.. మంత్రులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల ఫామ్ హౌస్‌లు, విల్లాలను, ఎందుకు ముట్టుకోవడం లేదని నిలదీశారు.
రేవంత్ రెడ్డి లాంటి భూ బకాసురుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. మూసీ బాధితుల కోసం అన్ని రకాలుగా అండగా ఉంటామని, న్యాయ పోరాటంలోనూ బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
