ఈసారి 3 కార్పొరేషన్లలోనూ సమ్మర్ కోచింగ్.. 44 రకాల క్రీడల్లో ట్రైనింగ్

ఈసారి 3 కార్పొరేషన్లలోనూ సమ్మర్ కోచింగ్.. 44 రకాల క్రీడల్లో ట్రైనింగ్
  • ఏప్రిల్ 1 నుంచి  మే 31 వరకు  
  • ఆరేండ్ల నుంచి 16 ఏండ్ల లోపు వారు అర్హులు
  • విలీనమైన 27 లోకల్ బాడీల్లో మొదటిసారి క్యాంపులు
  • 1500 మంది టెంపరరీ కోచ్​ల నియామకానికి ప్లాన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ ఏడాది మూడు కార్పొరేషన్ల పరిధిలో వేర్వేరుగా సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. 44 రకాల క్రీడల్లో ఏప్రిల్ 1 నుంచి మే 31వ తేదీ వరకు 2 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. దీని కోసం ఈ నెల 10వ తేదీ నుంచే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

ట్రైనింగ్​తీసుకోవడానికి కనీస వయస్సు ఆరేండ్లు ఉండాలని, 16 ఏండ్లలోపు ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఈ ఏడాది కార్పొరేషన్లలో విలీనమైన 27 లోకల్ బాడీల పరిధిలో సమ్మర్ క్యాంపులను నిర్వహిస్తుండడంతో మొదటిసారి శివారు ప్రాంతాల్లోని పిల్లలకు కూడా ఉపయోగించుకునే అవకాశం వచ్చింది.

స్పోర్ట్స్ మెటీరియల్  కోసం మూడు చోట్ల కలిపి దాదాపు రూ.2  కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో దాదాపు 2 లక్షల మంది ఈ శిక్షణకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు 1500 మంది హానరరీ కోచ్(వేతనం లేకుండా) లను నియమించుకోనున్నారు. కోచింగ్​ఇచ్చినందుకు వారికి ట్రాక్ షూట్, షూస్​ఇవ్వనున్నారు.

 మార్చి 10 తర్వాత .. 

సమ్మర్ క్యాంపుల అప్లికేషన్లను మార్చి10 తర్వాత స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు  https://sports.ghmc.gov.in/  వెబ్ సైట్ ను విజిట్​చేయాలి. పేర్లు నమోదు చేసుకుని అక్కడే ఫీజు చెల్లించాలి. షటిల్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ కు రూ. 50,  మిగతా క్రీడలకు 10 రూపాయలు చెల్లించాలి. 

44 రకాల క్రీడలివే..

సమ్మర్ క్యాంపుల్లో భాగంగా అథ్లెటిక్స్, ఆర్చరీ, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖోఖో, కార్ఫ్ బాల్, మాల్ కంబా, నెట్ బాల్, రోలార్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సెపక్ తక్రా, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికాయిట్, థైక్వాండో, టగ్​ఆఫ్​వార్​, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, ఉషు, యోగా, త్రో బాల్, కిక్ బాక్సింగ్, మయ్ థాయ్, స్కే మార్షల్ ఆర్ట్స్, మినీ ఫుట్ బాల్, క్యారమ్స్ గేమ్స్​ పై కోచింగ్ ఇవ్వనున్నారు.