మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో నిర్మాత, నటుడు బండ్ల గణేష్ తనదైన శైలిలో చేసిన ప్రసంగం అభిమానుల్లో జోష్ నింపడమే కాకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా మెగాస్టార్ పై వస్తున్న విమర్శలకు ఆయన ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
'చిరంజీవి తొక్కేశాడు.. చిరంజీవి తొక్కుతాడా?' అంటూ వస్తున్న ట్రోల్స్ కు బండ్ల గణేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు . శ్రీ వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా.. మెగాస్టార్ ఎవరినీ తొక్కడు. ఎక్కుతాడు.. ఎక్కిస్తాడు. లేపుతాడు.. లేపి కూర్చోబెడతాడు అంటూ ఉద్వేగభరితంగా మాట్లాడారు. ప్రతిభ, నిజాయితీ, కష్టపడే తత్వం ఉన్నవారిని గుర్తించి వారికి ఉన్నత స్థానం కల్పించడమే చిరంజీవి లక్ష్యమని కొనియాడారు.
చిరంజీవి ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఓ సాధారణ కానిస్టేబుల్ కుమారుడిగా చెన్నైకి వచ్చి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు గర్వించే మెగాస్టార్‌గా ఎదిగారని బండ్ల గణేష్ అన్నారు. తనకు జీవితాన్ని ఇచ్చిన పవన్ కల్యాణ్‌ను సినీ పరిశ్రమకు తీసుకొచ్చిన వ్యక్తి చిరంజీవేనని గుర్తుచేశారు. రామ్ చరణ్ రూపంలో ఆయనకు లభించిన వారసత్వం కూడా అరుదైన అదృష్టమని పేర్కొన్నారు.
కుటుంబ విలువలను పాటించడంలో చిరంజీవికి సాటిలేరని బండ్లగణేష్ ప్రశంసించారు. వయసైన తల్లిని కంటికి రెప్పలా చూసుకునే కొడుకని, తనలాంటి వారిని కూడా ఆప్యాయంగా ఆదరిస్తారని చెప్పారు. తాను ఇల్లు కట్టుకున్నప్పుడు తీవ్రమైన నడుము నొప్పితో ఉన్నప్పటికీ చిరంజీవి తనను ఆశీర్వదించేందుకు దూరం ప్రయాణించి వచ్చారని భావోద్వేగంగా గుర్తుచేసుకున్నారు.
ALSO READ : Chiranjeevi 71st Birthday: సామాన్యుడిగా అడుగుపెట్టి..
చిరంజీవి ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే నాలాంటి వాళ్లు వచ్చేవాళ్లు కాదు. సామాన్యుడు కూడా కష్టపడితే స్టార్ అవ్వొచ్చని చిరంజీవి చూపించారు అంటూ బండ్ల గణేష్ ప్రశంసలు కురిపించారు. చిరంజీవి వ్యక్తిత్వం, జీవితం భావితరాలకు పాఠ్యపుస్తకం కావాలని ఆకాంక్షించారు. మెగాస్టార్ ను ఉద్దేశించి బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
