రైతుల అకౌంట్లైపై ఫ్రీజింగ్ పెట్టి వడ్డీ కట్టించుకుంటున్న బ్యాంకర్లు

రైతుల అకౌంట్లైపై ఫ్రీజింగ్ పెట్టి వడ్డీ కట్టించుకుంటున్న బ్యాంకర్లు
  • మూడేండ్లుగా క్రాప్​లోన్లు మాఫీ చేయని రాష్ట్ర సర్కారు
  • న్యాయం కోసం ఆందోళనకు దిగుతున్న అన్నదాతలు

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలానికి చెందిన పలువురు రైతులు వారి అకౌంట్లలో వడ్ల పైసలు డ్రా చేసుకుందామని సోమవారం లోకల్​గా ఉన్న ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్​కు వెళ్లారు. తీరా క్రాప్​లోన్లపై వడ్డీ కట్టలేదనే కారణంతో తమ అకౌంట్లపై ఫ్రీజింగ్​పెట్టారని తెలుసుకొని బ్యాంక్​ఎదుట ధర్నాకు దిగారు. సర్కారు క్రాప్​లోన్లు మాఫీ చేయకపోవడం వల్ల ప్రతీ సీజన్​లోనూ బ్యాంకోళ్లు వడ్ల పైసలు ఆపి, వడ్డీ కింద వేలకు వేలు కట్టించుకుంటున్నారని ఆరోపించారు. మూడేండ్లలో మాఫీ అయ్యే లోన్​కంటే తమ నుంచి వసూలు చేసిన వడ్డీయే ఎక్కువగా ఉందని వాపోయారు. కోమట్​పల్లి, ఐలాపూర్, పోతాయిపల్లి, పోల్కంపేట, ఎల్లారం, సురాయిపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. 

వెలుగు, నెట్​వర్క్: సర్కారు క్రాప్​లోన్స్​మాఫీ చేయకపోవడంతో బ్యాంకర్లు వడ్ల పైసలను వడ్డీ కింద జమేసుకుంటున్నారు. వడ్డీ కట్టి లోన్లు రెన్యువల్​చేసుకోలేదనే కారణంతో పలు బ్యాంకులు రైతుల అకౌంట్లపై ఫ్రీజింగ్​పెడుతున్నాయి. ఇప్పటికే కొనుగోలు సెంటర్లలో నెలకుపైగా పడిగాపులు పడి అతికష్టం మీద  వడ్లు అమ్ముకున్న రైతులు తీరా అకౌంట్లలో పడుతున్న పైసలను కండ్ల జూడలేకపోతున్నారు. డబ్బులు డ్రా చేసుకుందామని పోతున్న పలువురు, వారి అకౌంట్లను ఫ్రీజింగ్​లో పెట్టారని తెలుసుకొని లబోదిబోమంటున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా లింగంపేటలోని ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంక్ లో ఆరు గ్రామాలకు చెందిన రైతులకు ఇలాంటి అనుభవమే ఎదురుకావడంతో బ్యాంక్​ షటర్​ మూసి ఆందోళనకు దిగారు. 
సర్కారు మాఫీ చెయ్యది.. బ్యాంకర్లు వినరు 
రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్​ సర్కారు, లక్ష లోపు పంట రుణాలను మూడేండ్లలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 2018 డిసెంబరు 11ను కటాఫ్‌‌ తేదీగా నిర్ణయించి, అప్పటివరకు ఉన్న క్రాప్ లోన్లు( వడ్డీ, అసలు కలిపి) రూ.లక్ష వరకు తానే చెల్లిస్తానని చెప్పింది. స్టేట్​వైడ్​40.66 లక్షల  రైతులకు సంబంధించి రూ.25,936 కోట్ల క్రాప్​లోన్స్​ ఉండగా, గడిచిన మూడేండ్లలో కేవలం 4లక్షల మంది రైతులకు సంబంధించి రూ.732.24 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఇంకా 36.66 లక్షల మంది రైతులకు సంబంధించి 25,203 కోట్లను ప్రభుత్వం మాఫీ చేయాల్సి ఉంది. రూ.25 వేలలోపు లోన్లను పూర్తిగా మాఫీ చేసినప్పటికీ  ప్రస్తుతం పెండింగ్ పెట్టిన రుణాలన్నీ రూ.50 వేలు, ఆపైన ఉన్నవే. ఈ లోన్లను ఏడాదికోసారి వడ్డీ కట్టి  రెన్యువల్​చేసుకోవాలని బ్యాంకులు చెబుతున్నా సర్కారు మాఫీ చేస్తుందనే నమ్మకంతో చాలామంది రైతులు పట్టించుకోవడం లేదు. దీంతో బ్యాంకర్లు రైతుల అకౌంట్లలో వడ్ల పైసలు పడగానే ఫ్రీజింగ్​పెడుతున్నారు. క్రాప్​లోన్లపై వడ్డీని అణాపైసాతో సహా కట్టించుకున్నాకే డ్రా చేసుకోనిస్తున్నారు. ఇప్పటికి మూడేండ్లుగా ప్రతి సీజన్​లోనూ ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ఆయా జిల్లాల్లో రైతులు ఆందోళన చేసిన ప్రతిసారీ కలెక్టర్లు బ్యాంకర్లను హెచ్చరించడం, వాళ్లు  ఎప్పట్లాగే పెడచెవినపెట్టడం కామన్​గా మారింది.
వడ్ల పైసలు పట్టుకుంటన్రు
లింగంపేట ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్​లో నాకు రూ.64 వేల క్రాప్​లోన్​ ఉంది. పోయిన యాసంగిలో వడ్ల పైసలు రాగానే మిత్తి కింద రూ.21వేలు కట్టిన. వానకాలం వడ్లు  కొద్ది రోజుల కింద కాంటా పెట్టిన.  వారం కింద నా బ్యాంక్ అకౌంట్​లో పైసలు పడ్డయి. ఇందులో రూ.10వేలు డ్రా చేసుకున్న. మిగిలిన పైసలు తీసుకుందమని పోతే నా అకౌంట్ ఫ్రీజింగ్​పెట్టిన్రు. లోన్ ఉన్నందున ఫ్రీజింగ్​పెట్టినమని చెబుతున్నరు. గవర్నమెంట్  రూ.లక్ష లోపు లోన్లన్నీ మాఫీ చేసినమంటోంది. వీళ్లేమో  వడ్ల పైసలు పట్టుకుంటన్రు.  ఇదెక్కడి న్యాయం? -రమేశ్​గౌడ్, కోమట్ పల్లి, కామారెడ్డి జిల్లా
వడ్డీకి వడ్డీ గుంజుతన్రు  
నాలుగు ఎకరాల్లో వరి వేసిన. వడ్ల పైసలు ఈమధ్యే పడ్డయి. కానీ బ్యాంక్ లో డ్రాచేసుకోకుండా ఫ్రీజింగ్​పెట్టిన్రు. ప్రభుత్వం మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ చేయలేదు. సర్కారు చేసిన తప్పుకు బ్యాంకర్లు మమ్ముల బలిచేస్తన్రు. సర్కారు మాఫీ చెయ్యకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలకు వడ్డీలు గుంజుతన్రు. ఇప్పటికైనా సర్కారు క్రాప్​లోన్లు మాఫీ చేసి రైతులపై వడ్డీ భారం తగ్గించాలె. -రామలింగం, రైతు, రామగుండం
అప్పు చేసి రెన్యువల్​ చేయించుకున్న​ 
నాకు రెండెకరాల పొలం ఉంది. దీనిపై మొగిలిపేట్ లోని కెనరా బ్యాంకు లో క్రాప్​లోన్​తీసుకున్న. మూడేండ్లుగా సర్కారు లోన్​మాఫీ చేస్తలేదు. దీంతో ప్రతి సీజన్​లోనూ బ్యాంకోళ్లు నా అకౌంట్ ఫ్రీజింగ్​పెడుతున్నరు. వడ్డీ కట్టినంకనే రెన్యువల్​ చేస్తున్నరు. ఈసారి కూడా ఫ్రీజింగ్​ పెట్టిన్రు. వడ్ల పైసలు పడ్డంక ఆపుతరనే భయంతో  ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చి రెన్యువల్​ చేయించుకున్న. -మామిడి రాజ శేఖర్ రెడ్డి, మల్లాపూర్, జగిత్యాల జిల్లా