- వానాకాలం సీజన్‌లో రూ.58 వేల కోట్ల క్రాప్ లోన్లు ఇవ్వాలని టార్గెట్
- రైతు భరోసాతో కొంత ఊరట
- పెట్టుబడులు పెరగడంతో ప్రైవేట్ అప్పుల బాట పడుతున్న చిన్న, సన్నకారు, కౌలు రైతులు
హైదరాబాద్, వెలుగు : ఎల్‌నినో ఎఫెక్ట్ వర్షాలకే పరిమితం కాకుండా.. రైతులకు అందాల్సిన క్రాప్ లోన్లపైనా పడుతోంది. వర్షాభావం, పంటల సాగుపై అనిశ్చితి ఏర్పడడంతో రైతులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు వెనుకంజ వేస్తున్నారు. ఫలితంగా అవసరమైన సమయంలో పెట్టుబడి అందక రైతులు ప్రైవేట్ అప్పులపైన ఆధారపడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన రైతు భరోసాతో కొంత వెసులుబాటు కలిగినప్పటికీ పెట్టుబడులు పెరగడంతో రైతులకు అప్పుల తిప్పలు తప్పడం లేదు.
టార్గెట్ లో 34.5 శాతమే పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్‌లో రైతులకు రూ.58,152 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)కి టార్గెట్ ఇచ్చింది. సాధారణంగా జూన్, జులె నెలల్లో తొలకరి వర్షాలు పడిన వెంటనే రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసి పంటల సాగు ప్రారంభిస్తుంటారు. దీంతో ఆ నెలల్లోనే రైతులకు ఎక్కువ రుణాలు అవసరం అవుతాయి.
కానీ ఈ సీజన్ లో ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు పడడం లేదు. దీంతో చాలా చోట్ల రైతులు విత్తనాలు వేయలేదు. దీంతో సాగు విస్తీర్ణంపై స్పష్టత లేకపోవడంతో బ్యాంకర్లు రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు ముందుకు రావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం రూ.20,069 కోట్ల రుణాలే మంజూరయ్యాయి. అంటే మొత్తం టార్గెట్ లో 34.5 శాతం మాత్రమే పూర్తైంది. రైతులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న పెద్దగా ఫలితం ఉండడం లేదు.
ఇబ్బందుల్లో సన్నకారు, కౌలు రైతులు
రాష్ట్రంలోని వ్యవసాయ కుటుంబాల్లో 91.33 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వీరిలో చాలా మంది రెండున్నర నుంచి ఐదు ఎకరాల్లోపు మాత్రమే సాగు చేస్తున్నారు. మరో వైపు రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరందరికీ వ్యవసాయ పెట్టుబడుల కోసం పంట రుణాలే ప్రధాన ఆధారం. అయితే భూరికార్డులు, ఇతర సాంకేతిక కారణాలు చూపుతూ బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు చేస్తున్నట్లు భూయజమాని నుంచి హామీ పత్రం తీసుకురావాలని బ్యాంకర్లు చెబుతుండడంతో వారు రుణాలకు దూరం అవుతున్నారు. 2011లో కౌలు రైతుల కోసం రూపొందించిన కౌలుదారు చట్టం ప్రకారం రుణ అర్హత కార్డులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అమలుకావడం లేదని రైతు సంఘాల లీడర్లు చెబుతున్నారు.
ప్రైవేట్ అప్పుల వైపు చూస్తున్న రైతులు
బ్యాంకు నుంచి పంట రుణం పొందిన రైతు ఏడాదిలోపు రుణాన్ని చెల్లిస్తే రూ.లక్ష వరకు వడ్డీ రాయితీ, రూ.3 లక్షల వరకు పావలా వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. కానీ బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయకపోవడంతో రైతులు ఈ ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. తమ వద్ద డబ్బులు లేకపోవడం, బ్యాంకుల నుంచి లోన్లు రాకపోవడంతో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు, కూలీల ఖర్చుల కోసం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.
అధిక వడ్డీ భారం, పంట నష్టాలు, మార్కెట్ అనిశ్చితితో రైతుల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు రుణాల పంపిణీ వేగవంతం చేయాలని, లేకపోతే మొత్తం వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైతు భరోసాతో కొంత వెసులుబాటు
వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 70,40,286 మంది రైతులకు రూ.8,759.60 కోట్ల రైతు భరోసా నిధులు అందాయి. దీంతో రైతులకు కొంత ఊరట లభించినట్లైంది. కానీ పెట్టుబడులు పెరిగిపోవడంతో చిన్న, సన్నకారు, కౌలు రైతులకు పెట్టుబడి ఇబ్బందులు తప్పడం లేదు.
పెట్టుబడికి సరిపోని రుణ పరిమితులు
వ్యవసాయ పెట్టుబడులు ఏటేటా పెరుగుతుండడంతో బ్యాంకులు అందిస్తున్న రుణ పరిమితులతో రైతుల అవసరాలు తీరడం లేదు. రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ), స్టేట్ కోపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకటించినా, అనేక పంటలకు నిర్ణయించిన రుణ పరిమితులు వాస్తవ సాగు ఖర్చులకు సరిపోవడం లేదు.
ప్రస్తుతం వరి సాధారణ సాగుకు ఎకరాకు రూ.48 వేలు, నీటి వసతి ఉన్న పత్తికి రూ.52 వేలు, వర్షాధార పత్తికి రూ.50 వేలు, మిరపకు రూ.90 వేల నుంచి రూ.లక్ష, పసుపుకు రూ.92 వేలు, టమాటకు రూ.58 వేలు వరకు రుణ పరిమితి నిర్ణయించారు. కానీ మార్కెట్లో పెరిగిన విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఈ పరిమితులు చాలడం లేదని రైతులు అంటున్నారు.
అమలుకాని ఆర్‌బీఐ రూల్స్
రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు తమ మొత్తం రుణాల్లో 40 శాతం వ్యవసాయ రంగానికి కేటాయించాలి. ఇందులో 18 శాతం పంట రుణాలు, 22 శాతం దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలి. అలాగే వ్యవసాయ రుణాల్లో దళితులు, గిరిజనులకు నిర్దిష్ట వాటా కేటాయించాలి. ప్రతి బ్యాంకు బ్రాంచ్ ఏటా కనీసం 100 మంది కొత్త రైతులకు రుణాలు ఇవ్వాలని ఆర్‌బీఐ సూచించింది. కానీ రాష్ట్రంలో బ్యాంకర్లు ఈ నిబంధనలు పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.
గ్రామీణ బ్యాంకుల ద్వారా పంట రుణాల పంపిణీని వేగవంతం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ప్రతి రైతుకు సాగు విస్తీర్ణానికి అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని, కౌలు రైతులకు కూడా ప్రత్యేక విధానంతో రుణాలు ఇవ్వాలని రైతుల సంఘాల నాయకులు కోరుతున్నారు.
అటవీ జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు సాధారణంగా ఇనుప కంచె వేస్తుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లా మారుగూడ గ్రామానికి చెందిన రైతు జాదవ్ లాల్ సింగ్ వినూత్నంగా చీరలతో కంచె కట్టి పంటను కాపాడుకుంటున్నాడు. గతంలో ఐదు ఎకరాల్లో జొన్న సాగు చేయగా.. అడవి పందులు ఇనుప కంచెను దాటుకొని వచ్చి పంటను ధ్వంసం చేశాయి.
దీంతో రూ. 20 చొప్పున 120 చీరలు కొని వాటిని చేను చుట్టూ కట్టాడు. గతంలో అడవి పందులు వచ్చి రూ. 28 వేల విలువైన విత్తనాలను నాశనం చేశాయని, కానీ, చీరల వల్ల బెదిరి పంట చేను వైపు రావడం లేదని చెబుతున్నాడు.
– వెలుగు ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
