
- బకాయిల్లో జమ చేయాలన్న బ్యాంక్ మేనేజర్
- ఆందోళనకు దిగిన రైతులు
వానాకాలం సేద్యానికి ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు పథకం డబ్బులను బ్యాంకు మేనేజర్ బకాయిల్లో జమ చేసుకుంటానని అనడాన్ని నిరసిస్తూ సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి ఏపీజీవీబి బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేశారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాలో పథకం డబ్బులు జమ చేసింది. డబ్బులు డ్రా చేసేందుకు రైతులు బ్యాంకు వద్దకు వెళ్లగా పాత బకాయిల్లో జమ చేయాలని బ్యాంకు ఆఫీసర్లు ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. ఖాతాలను హోల్డ్ లో పెట్టడంతో ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయలేకపోతున్నామని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బాధిత రైతులు సోమవారం బ్యాంకు వద్దకు వెళ్లి మేనేజరు మదన్ను నిలదీశారు. పాత బకాయిలు పేరుకుపోతున్నాయని కొంత జమ చేయాలని మేనేజర్ సూచించగా డబ్బులు లేకుండా వ్యవసాయం ఎట్లా చేయాలని రైతులు ప్రశ్నించారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని బ్యాంకు ముందు బైఠాయించి ఆందోళన చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జూలూరుపాడు సీఐ నాగరాజు, ఎస్సై సుమన్, ఏవో అనూష బ్యాంకు వద్దకు చేరుకొని మేనేజరుతో మాట్లాడారు. హెడ్డాఫీసు ఆదేశాల మేరకు బకాయిలు వసూలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ట్లు మేనేజరు సమాధానం చెప్పారు. ఏవో అనూష మాట్లాడుతూ రైతుబంధు పథకం డబ్బులు రైతులకు చెల్లించాలని మేనేజరుకు సూచించారు. హెడ్డాఫీసు ఆఫీసర్ల దృష్టికి సమస్య తీసుకెళ్లివారి ఆదేశాల మేరకు నిరయ్ణం తీసుకుంటామని మేనేజరు చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.