- అభివృద్ధి పనులపై ఉన్నతాధికారుల సమీక్ష
బాసర, వెలుగు: నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో ఆలయ మాస్టర్ ప్లాన్, రాబోయే గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులపై రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు ఆలయ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ చీఫ్ జోగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీ రాజ్, దేవాదాయ శాఖ, మిషన్ భగీరథ, సాగునీటి శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. పుష్కరాల సమయంలో లక్షలాది భక్తులు బాసరను సందర్శించే అవకాశమున్నందున మాస్టర్ ప్లాన్ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఆయా శాఖ అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా గోదావరి ఘాట్‌ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సౌకర్యాలపై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలు, అత్యవసర సేవలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ పరిధిలో జరుగుతున్న పనుల పురోగతిని వివరించగా, అవసరమైన చోట అదనపు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ చీఫ్ ఇంజినీర్ జోగారెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
