బాసర ట్రిపుల్ ఐటీలో నిన్న మధ్యాహ్నం నుంచి పవర్ కట్

బాసర ట్రిపుల్ ఐటీలో నిన్న మధ్యాహ్నం నుంచి పవర్ కట్

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కరెంట్ లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యాంపస్లో కరెంట్ లేదు. విద్యుత్ పునరుద్దరణకు మరో రెండు పడుతుందని సిబ్బంది తెలిపారు. రాత్రి క్యాండిల్స్ వెలుతురులో విద్యార్థులు భోజనం చేశారు. విద్యుత్ లేకపోవడంతో నీటి సరాఫరా కూడా నిలిచిపోయింది. అయితే సబ్ స్టేషన్ లో సమస్యల వల్లే క్యాంపస్లో తరుచూ విద్యుత్ కు అంతరాయం కలుగుతున్నట్లు సమాచారం. ఇక క్యాంపస్ లో ఉన్న భారీ సోలార్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండడం గమనార్హం. గవర్నర్ పర్యటించిన మరుసటి రోజే క్యాంపస్లో కరెంట్ లేదు. అయితే వసతుల కల్పనలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కాగా ఆదివారమే బాసర ట్రిపుల్ ఐటీని గవర్నర్ సందర్శించి..విద్యార్థుల సమస్యలను అడిగి తెల్సుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్..విద్యార్థుల డిమాండ్లు చాలా సింపుల్ గా ఉన్నాయన్నారు. విద్యార్థులకు మంచి క్వాలిటీ భోజనం అందించాలని సూచించారు. అమ్మాయిలకు భద్రత విషయంలో సమస్య ఉన్నట్లు తెలిసిందన్నారు. సిబ్బంది కొరత కూడా ఉందని..మెస్ ల విషయంలో పిల్లలు సంతోషంగా లేరని చెప్పారు. ఇవాళ్టి నుంచి ఒక్కో సమస్య తీరుతుందన్న నమ్మకం ఉందన్నారు.