- రవీంద్రభారతిలో బసవేశ్వరుడి జయంతి వేడుకలు
రవీంద్రభారతి, వెలుగు: ప్రజలకు నైతిక విలువలతో కూడిన జీవన విధానాన్ని బోధించిన మహనీయుడు మహాత్మా బసవేశ్వరుడు అని మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో బసవేశ్వరుడి 893వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ, బసవేశ్వర భవన నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
బసవేశ్వరుడి ఆశయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయడంలో ప్రభుత్వమే కాదు.. ఆయన వారసులు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బసవేశ్వరుడి సంకల్పంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని గుర్తుచేశారు. మంత్రి శ్రీహరి మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ఇంకా అసమానతలు, వివక్షలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ సురేశ్ షెట్కర్ మాట్లాడుతూ, బసవేశ్వర భవన నిర్మాణం కోసం రూ.10 కోట్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
అంతకుముందు ట్యాంక్ బండ్ నుంచి రవీంద్రభారతి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, మాజీ ఎంపీ బీబీ పాటిల్, మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్, బీసీ సంక్షేమశాఖ, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి బాల మాయాదేవి, తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

