ఫ్లై ఓవర్లు చూపించి ఇదే అభివృద్ధి అంటున్న సర్కారు

ఫ్లై ఓవర్లు చూపించి ఇదే అభివృద్ధి అంటున్న సర్కారు

కేసీఆర్ సర్కారు నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్లో బస్తీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్ ప్రేమ్ నగర్ లోని అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ థర్డ్ఫ్లోర్ కు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు కలుషిత నీటితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మంచి నీటి కొరత, మురుగు నీటి ఇబ్బందులు, అధ్వాన్నంగా ఉన్న రోడ్లతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రకటనలు, రియల్ ఎస్టేట్ ప్రచారాలకు డబ్బు ఖర్చు చేస్తున్న బీహెచ్ఎంసీ అధికారులు.. ఈ పనులకు మాత్రం నిధులు లేవని చెబుతున్నారని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్లను చూపించి ఇదే అభివృద్ధి అంటోందని.. హైఫై రోడ్ల వల్ల ప్రజలకు ఒరిగేదేమీలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలనీలు, బస్తీల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సర్కారుకు 80శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నా అందులో 5శాతం కూడా నగర ప్రజల కోసం ఖర్చు చేయడం లేదని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.85వేల కోట్లు ఖర్చు చేశామని కేటీఆర్ చెబుతున్నారని, ఆ నిధులతో ఏ పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే తాను పాల్గొంటున్న కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి గైర్హాజరవడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించరా అంటూ అధికారులను ఫోన్లో నిలదీశారు.