సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగింపు

సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగింపు

‘‘తంగేడు పూవుల్ల చందమామ..
బతుకమ్మ పోతుంది చందమామ.
పోతే పోతివిగాని చందమామ..
మల్లెన్నడొస్తావు చందమామ’’ అంటూ మొదలైన బతుకమ్మ ఆటపాటలు..
‘‘పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా..
పోయి నీ అత్తింట్ల బుద్ధిగలిగుండు..’’ 

అని పాడుతూ సద్దుల బతుకమ్మను సాగనంపడంతో సంబరాలు ముగుస్తాయి. ఆశ్వయుజ అష్టమినాడు పొద్దు వాలగానే ఏ దిక్కు చూసినా బతుకమ్మ ఆటపాటలే కనిపిస్తాయి. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో ఊరు, వాడలన్నీ పూల వనాలే అవుతాయి. చెరువు గట్లన్నీ ఆనందంతో ఉప్పొంగుతాయి. పల్లె, పట్నమని తేడా లేకుండా అన్ని చోట్లా సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మని సాగనంపడానికి ఆడబిడ్డలంతా అత్తింటినుంచి పుట్టింటికి వస్తారు. పొద్దు పొడవకముందే ఇల్లు, వాకిలి సర్దుకుని పట్టు బట్టలతో అందంగా ముస్తాబవుతారు.  అన్నదమ్ములు తెచ్చిన గునుగు, గుమ్మడి, తంగేడు, సీతజడ, చామంతి, గోరింట పూలతో బతుకమ్మ పేర్చుతారు. సద్దుల బతుకమ్మరోజు రెండు బతుకమ్మలు చేస్తారు. పెద్ద బతుకమ్మను తల్లిగా, చిన్న బతుకమ్మను కూతురుగా అనుకుని పాటలు పాడుతూ సాగనంపుతారు. 

ప్రసాదాలు

సద్దుల బతుకమ్మరోజు వాయనంగా పెసలు, బియ్యం పిండితో సత్తు, మలిద ముద్దలు తయారుచేస్తారు. బతుకమ్మని సాగనంపాక ఆ వాయినాల్ని ‘ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం’ అంటూ ఒకరికొకరు పంచుకుంటారు. 

మలిద ముద్దలు

కావాల్సినవి: 

గోధుమ పిండి– ఒక కప్పు, డ్రై ఫ్రూట్స్‌‌– 100 గ్రాములు, బెల్లం– 200 గ్రాములు, నెయ్యి– కొద్దిగా, కొబ్బరి– కొద్దిగా, యాలకులు– మూడు, సోంపు– ఒక టేబుల్‌‌ స్పూన్‌‌

తయారీ: 

గోధుమపిండిని ముద్దలా కలపాలి. నెయ్యి రాస్తూ పిండిని చపాతీల్లా ఒత్తి, రెండు వైపులా కాల్చాలి. వాటిని హాట్‌‌ బాక్స్‌‌లో పెట్టాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్‌‌, కొబ్బరి, యాలకులు, సోంపు కలిపి కచ్చాపచ్చాగా గ్రైండ్‌‌ చేయాలి. చపాతీలను కూడా ముక్కలుగా చేసి గ్రైండ్‌‌ చేయాలి. దీన్ని డ్రై ఫ్రూట్స్‌‌ పౌడర్‌‌‌‌లో కలపాలి. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు చుట్టాలి.

నోట్‌‌: చపాతీలు చల్లగా అయితే మలిద ముద్దలు చేయడం కష్టం అవుతుంది. అందుకే వేడిగా ఉన్నప్పుడే చేయాలి.

బియ్యం సత్తుపిండి

కావాల్సినవి: 

బియ్యం– ఒక కప్పు, యాలకులు– 3
చక్కెర– అరకప్పు, 
నెయ్యి– రెండు టీ స్పూన్లు, 

తయారీ: 

ఒక గిన్నెలో బియ్యం వేసి ఎర్రగా వేగించాలి. తర్వాత చక్కెర, యాలకులు కలిపి మెత్తగా పొడి చేయాలి. వేగించిన బియ్యం చల్లారాక వాటిని కూడా మెత్తగా పొడి పట్టాలి. ఇంకో గిన్నెలో నెయ్యి కరిగించి సన్నటి మంటమీద బియ్యప్పిండిని వేగించాలి. తర్వాత చక్కెర పొడి వేసి కలిపితే సత్తుపిండి రెడీ.