- ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ
- తొమ్మిది రోజుల పాటు కోలాహలం
- 18న ట్యాంక్ బండ్ పై సద్దుల బతుకమ్మ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలకు వేళైంది. ఊరూరా రంగురంగుల పూల సింగిడి పరుచుకోనున్నది. నేటి ఎంగిలిపూల బతుకమ్మతో మొదలయ్యే సంబురాలు తొమ్మిది రోజులపాటు అంబరాన్ని అంటనున్నాయి. ఇక సద్దుల బతుకమ్మ దాకా చిన్నా పెద్ద తేడా లేకుండా ఆడబిడ్డలంతా బతుకమ్మలను పేర్చి, ఆటపాటల్లో మునిగితేలుతారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వాడలన్నింటినీ ఆటాపాటలతో హోరెత్తిస్తారు. ప్రభుత్వం సైతం ఈ ఏడాది బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. జిల్లా కేంద్రాలు, ప్రధాన కూడళ్లలో విద్యుత్ దీపాల అలంకరణతోపాటు చెరువులు, ఘాట్ల వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి రూ.10 కోట్లు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులను అధికారులు ముమ్మరం చేశారు. పల్లెల్లో చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ ఘాట్ల ఏర్పాటుతోపాటు రహదారుల మరమ్మతులు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ ఇప్పటికే ఆదేశించింది. ఘాట్ల చుట్టుపక్కల ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి, విద్యుత్ దీపాలను అమర్చడం, ఘాట్ల వద్ద ప్రజల రక్షణ కోసం బారికేడ్లు, మెట్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందుకోసం అవసరమైన నిధులను పంచాయతీల జనరల్ ఫండ్ లేదా ఇతర నిధుల నుంచి వినియోగించుకోవాలని ఆఫీసర్లను ఆదేశించింది.
18న ట్యాంక్‌బండ్‌పై ‘సద్దుల’ సంబురం..
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. 18న సాయంత్రం 4 గంటలకు తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నుంచి వేలాది మంది ఆడపడుచులతో భారీ బతుకమ్మ ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిర్వహిస్తారు. తర్వాత బతుకమ్మ ఘాట్, నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో బతుకమ్మల నిమజ్జనానికి ప్రత్యేక ప్లాట్‌ఫారాలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా, హైదరాబాద్నగరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను బతుకమ్మ ఆకృతులు, రంగురంగుల విద్యుద్దీపాలతో సుందరంగా తీర్చిదిద్దనున్నారు. తెలంగాణ సాంస్కృతిక కేంద్రమైన రవీంద్రభారతిలో పది రోజులపాటు ప్రత్యేక బతుకమ్మ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక, చారిత్రక ప్రాంతాల్లోనూ పండుగ వాతావరణం ఉట్టిపడేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఖ్యాతిని, మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం బతుకమ్మకు ప్రత్యేక లోగోను రూపొందిస్తుండడం విశేషం.
పూల ధరలకు రెక్కలు..
బతుకమ్మలను పేర్చేందుకు తంగేడు, గునుగు, సీతమ్మజడ, చామంతి, బంతి వంటి రకరకాల పూలను వాడుతారు. అయితే, ఈసారి ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పూల దిగుబడి తగ్గిపోయింది. ముఖ్యంగా అడవులు, బీడు భూముల్లో గునుగు, తంగేడు లాంటి పూలు ఆశించిన స్థాయిలో పూయలేదు. ఫలితంగా మార్కెట్‌లో పూల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. గతంలో ఉచితంగా లభించే అడవి పూలను కూడా ఇప్పుడు మార్కెట్లో డబ్బులు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చిందని మహిళలు వాపోతున్నారు. ముఖ్యంగా బంతి, చామంతి పూల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయని చెప్తున్నారు.
ఎంగిలిపూల బతుకమ్మ నేపథ్యం ఇదీ..
ఆశ్వయుజ పాఢ్యమికి ముందు వచ్చేది పితృ అమావాస్య. దీనిని పెతరమావాస్యగా కూడా పిలుస్తారు. ఆరోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. ఏ పండుగైనా చేయడానికి ముందు పెద్దలను తలచుకోవడం మన సంప్రదాయం. అందుకే పితృ అమావాస్య రోజున పెద్దలను తలుచుకుంటూ బతుకునివ్వమని వేడుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. సాధారణంగా పండుగలు, వ్రతాలు, నోముల సందర్భంగా శుచిశుభ్రతతో వంట చేసి, పూజానంతరం దేవుడికి నైవేద్యం సమర్పించి, ఆ తర్వాత భోజనం చేస్తుంటారు. కానీ, పెతరమావాస్య రోజు మాత్రం పూజ చేసి, భోజనానంతరం బతుకమ్మను పేరుస్తారు. గౌరమ్మను చేసి పూజిస్తారు. ఎంగిలి పడ్డాక బతుకమ్మను పూజిస్తారు. కాబట్టి ఈ రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఆ తర్వాత తొమ్మిది రోజులు బతుకమ్మను పేర్చి ఆడుతారు. చివరిరోజు సద్దుల బతుకమ్మ, పెద్ద బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఆరో రోజు మాత్రం అరిష్టంగా భావించి ఆడడం మానివేస్తారు. ఇతర రోజుల్లో బతుకమ్మను పేర్చి ఆడడ౦తో పాటు ఆట అనంతరం స్త్రీలు రకరకాల వాయినాలను ఇచ్చిపుచ్చుకుంటారు.
