- ప్రధానికి బీసీ సంఘాల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీసీల సమస్యలపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం అఖిలపక్ష బీసీ నేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలు అడుగుతున్న 10 ప్రశ్నలకు ప్రధాని మోదీ జవాబు చెప్పాలని, లేకుంటే ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు.
ఈనెల 9న వీహెచ్ చేపట్టబోయే ఆమరణ నిరాహార దీక్షకు బీసీ సంఘాలు పూర్తి మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ ఓబీసీ సెల్ తరఫున ఈనెల 9, 10 తేదీల్లో నిరసనలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వెల్లడించారు.
