
- ఈ నెల 23 నుంచి మళ్లీ పాదయాత్ర.. జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే
- బీసీ రిజర్వేషన్లపై మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించాల్సిన పనిలేదు
- బీజేపీ నేతల వల్లే బీసీలకు నష్టం
- పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు కేసీఆరేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీ సీఎం కాంగ్రెస్‌తోనే సాధ్యమని, ఇతర ఏ పార్టీలోనూ అది సాధ్యం కాదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. పదేండ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి మాట్లాడడంలో తప్పులేదని, తమ ప్రభుత్వంపై విశ్వాసం పెంచేందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పారు.
‘‘సీఎం రేవంత్‌కు నాకు మధ్య విభేదాలు ఉన్నట్టు కొందరు విషప్రచారం చేస్తున్నారు. కానీ, అందులో వాస్తవం లేదు. రేవంత్‌కు నాకు మధ్య మంచి రిలేషన్ ఉంది కాబట్టే.. రిజర్వేషన్లపై పట్టువిడవకుండా పోరాడుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చాలా మారారు.. పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వేరు.. సీఎంగా రేవంత్ రెడ్డి వేరు’’ అని వ్యాఖ్యానించారు. శనివారం గాంధీ భవన్‌లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ నెల 23 తర్వాత మళ్లీ జనహిత పాదయాత్ర మొదలు పెడతున్నట్టు ప్రకటించారు.
“ఈ పాదయాత్రను పీసీసీ చీఫ్ హోదాలో నేనే చేపట్టాను. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పూర్తిస్థాయిలో సహకరించారు. మొదట బస్సు యాత్ర చేయాలనుకున్నాం.. ఆ తర్వాత పాద యాత్రగా మార్చాం.. నా పాదయాత్రలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా మధ్యలో జాయిన్ అవుతారు. భారత్ జోడో యాత్రను తలపించేలా పాద యాత్ర జరుగుతున్నది. కొత్త పింఛన్లు ఇవ్వాలనే విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నాయి” అని మహేశ్ గౌడ్ తెలిపారు.
42 శాతం బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సర్కారు కమిట్‌మెంట్‌ను ఎవరూ శంకిచాల్సిన అవసరం లేదని అన్నారు. గుజరాత్, ఢిల్లీ, యూపీలో ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జంతర్ మంతర్ ధర్నాకు షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ 12 గంటలకు రావాల్సి ఉండగా.. రాంచీ పర్యటన లేటవ్వడంతో రాలేకపోయారని తెలిపారు. బీసీ రిజ ర్వేషన్లపై ఏఐసీసీ కార్యాలయంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చారని చెప్పారు.
బీజేపీ నేతల మౌనం బీసీలకు నష్టం
బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్ లాంటి బీసీ నేతల మౌనం బీసీలకు నష్టమని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. కిషన్ రెడ్డి భయంతో బీసీ రిజర్వేషన్లపై బండి సంజయ్, ఈటల రాజేందర్ మాట్లాడడం లేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. సికింద్రాబాద్ ఎంపీ టికెట్, రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీ నుంచి కిషన్ రెడ్డి లాక్కున్నారని పేర్కొన్నారు.
అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చిన బీజేపీ.. కేంద్రంలో మాత్రం బిల్లు పాస్ చేయనివ్వడం లేదని మండిపడ్డారు. స్వయం ప్రతిపత్తిగల సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తున్నదని, ఈడీ, సీబీఐ కేసులన్నీ ప్రతిపక్షాలపైనే పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఒక వ్యక్తికి 4 రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉందని, బిహార్‌లో ఓట్ల సవరణ పేరుతో పెద్ద మోసం జరుగుతున్నదని, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు.
నాలుగైదు రోజుల్లో పీఏసీ సమావేశం ఉంటుందని, పీఏసీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సర్వే జరుగుతున్నదని, ఈ సీటులో తమదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులపై కసరత్తు పూర్తయ్యిందని, త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా తమదే విజయమని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కీమ్‌లే తమను గెలిపిస్తాయని చెప్పారు. బై పోల్ షెడ్యూల్ వచ్చాకే అభ్యర్థి ఎంపిక ఉంటుందని వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే పోటీ పెట్టకుండా ఉండే సాంప్రదాయాన్ని కేసీఆర్ బ్రేక్ చేశారని మహేశ్‌గౌడ్ గుర్తు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలను క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు.