మిగిలిన బీసీ కులాలను ఓబీసీ లిస్టులో చేర్చాలి.. సీఎస్ రామకృష్ణారావుకు బీసీ కమిషన్ లేఖ

మిగిలిన బీసీ కులాలను ఓబీసీ లిస్టులో చేర్చాలి.. సీఎస్ రామకృష్ణారావుకు బీసీ కమిషన్ లేఖ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని మిగిలిన 40 బీసీ కులాలను తక్షణమే కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సీఎస్  రామకృష్ణారావుకు ఆయన లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. రాష్ట్రంలో మొత్తం130 బీసీ కులాలు ఉండగా, కేంద్ర ఓబీసీ జాబితాలో కేవలం 90 కులాలకు మాత్రమే చోటు దక్కిందని చైర్మన్ గుర్తు చేశారు. మిగిలిన 40 కులాలను చేర్చాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం, బీసీ కమిషన్ పలుమార్లు విన్నవించినా కేంద్రం నుంచి స్పందన లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ 40 కులాలను ఓబీసీ లిస్టులో చేర్చిన తర్వాతనే తెలంగాణలో జనగణనను ప్రారంభించాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తెలంగాణకు చెందిన 40 బీసీ కులాలను కేంద్ర ఓబీసీ లిస్టులో చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్రంలో జనగణన కార్యక్రమంలో భాగంగా మే11 నుంచి జూన్ 9, 2026 వరకు హౌస్ లిస్టింగ్ జరగనుందని, వచ్చే ఏడాది జనగణన ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి 28 వరకు జరగనుందని చైర్మన్ గుర్తు చేశారు. ఈ జనగణనలో కేంద్ర ప్రభుత్వ ఓబీసీ లిస్టులో ఉన్న తెలంగాణలోని 90 కులాల ప్రజలను మాత్రమే ఓబీసీలుగా గణనలోకి తీసుకోవడం జరుగుతోందని చెప్పారు. తద్వారా తెలంగాణలో ఉన్న బీసీ కులాల సంఖ్యను తక్కువగా చూపెట్టే ప్రమాదం ఉందని నిరంజన్ పేర్కొన్నారు.