ఫూలే జయంతిని పట్టించుకోని ప్రభుత్వం

ఫూలే జయంతిని పట్టించుకోని ప్రభుత్వం
  • ఎవరు.. ఎవరికి సన్మానం చేసిన్రో అర్థం కాలే.. 
  • సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా ఏ ఒక్కరూ రాలే
  • పేపర్‌‌ ప్రకటనలకే కేసీఆర్‌‌, మంత్రులు పరిమితం
  • పూలేను అగౌరవ పరిచారని బీసీ సంఘాల ఆగ్రహం

హైదరాబాద్‌‌, వెలుగు: సామాజిక దార్శనికుడు, సంఘ సంస్కర్త జ్యోతిబా పూలే జయంతి వేడుకలు రసాభాసగా జరిగాయి. సోమవారం హైదరాబాద్‌‌ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమం గందరగోళం మధ్య ముగిసింది. వచ్చిన గెస్ట్‌‌లు ప్రోగ్రాం మధ్యలోనే వెళ్లిపోయారు. మెమెంటోలు ఇచ్చేటప్పుడు, సన్మానాల సమయంలో.. ఎవరు సన్మానం చేస్తున్నారో.. ఎవరు సన్మానం చేయించుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి ఎవరికి వారు శాలువాలు, మెమెంటోలు ఎత్తుకపోయారు. కొందరైతే షీల్డులను ఏరుకుని తీసుకెళ్లారు. సాధారణంగా బీసీలు, ఇతర సమస్యలపై పోరాడిన వారికి పూలే జయంతి సందర్భంగా గెస్ట్‌‌లతో ఏటా శాలువాలు, మెమెంటోలతో సన్మానం చేస్తారు. వారి సేవలను కొనియాడుతారు. కానీ రవీంద్రభారతిలో కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించకుండా ముగించేశారు.

అంతా ప్రచారమే.. ఒక్కరూ రాలే..

పూలే జయంతి ఉత్సవాలను సర్కారు తూతూమంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకొని.. కనీసం పట్టించుకోలేదు. పూలే జయంతిపై సీఎం ముందు రోజే ప్రకటన చేసి మమ అనిపించారు. జయంతి కార్యక్రమానికి ఒక్క ప్రజాప్రతినిధి కూడా హాజరుకాలేదు. ఇన్విటేషన్‌‌‌‌లో చీఫ్‌‌‌‌ గెస్ట్‌‌‌‌గా సీఎం కేసీఆర్‌‌‌‌తోపాటు 16 మంది మంత్రులు, లోక్‌‌‌‌సభ, రాజ్యసభ సభ్యులు, సిటీ ఎమ్మెల్యేలు వస్తారని పేర్కొన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా రాలేదు. ఇక నిర్వహణ కోసం రూ.11 లక్షలు ఇచ్చినా అంతంత మాత్రంగానే ఖర్చు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. మీటింగ్‌‌‌‌కు తీసుకొచ్చిన విద్యార్థుల్లో కనీసం 30 శాతం మందికి కూడా లంచ్‌‌‌‌ పెట్టలేదు. ఎండాకాలం కావడంతో ఆకలితో ఇబ్బందులు పడ్డారు. ఉత్సవాల నిర్వహణ విషయంలో సర్కారు, ప్రజాప్రతినిధుల తీరుపై బీసీ సంఘాలు భగ్గుమంటున్నాయి. పూలేని అవమానించి, అగౌరవపరిచారని మండిపడ్డాయి.

జ్యోతిబా పూలే ఆశయాలను సాధించాలి: వక్తలు

ఆధిపత్య కులాల అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, విద్య ద్వారానే సమానత్వం సాధ్యమని పూలే చాటిచెప్పారని, ఆయన ఆశయాలతో ముందుకు సాగాలని వేడుకల్లో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వకుళాభరణం కృష్ణమోహన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ 
తదితరులు పాల్గొన్నారు.

పూలేకు ఇచ్చే గౌరవం ఇదేనా? 

పూలే జయంతి కార్యక్రమాన్ని అడ్డగోలుగా నిర్వహించారు. కనీసం సరైన పద్ధతిలో నివాళులర్పించకుండా అగౌరవపరిచారు. ప్రభుత్వం ఏం చేస్తున్నదో అర్థమైతలేదు. మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ ఢిల్లీకి వెళ్లిపోయారు. ఉన్నోళ్లైనా సరిగా వ్యవహరించాలి. ఆఫీసర్లకు బాధ్యత లేదా? పూలేకు ఇచ్చే గౌరవం ఇదేనా? సీఎం కేసీఆర్‌‌‌‌, గంగుల స్పందించాలి. 
- మట్ట జయంతి, బీసీ మహిళా జేఏసీ చైర్మన్