సూర్యాపేట, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని రాష్ట్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీసీ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టిస్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ కోఆర్డినేటర్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చలమల్ల నర్సింహ, టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్, తెలంగాణ రాష్ట్ర పద్మశాలీ సంఘం ప్రధాన కార్యదర్శి అప్పం శ్రీనివాసరావు మాట్లాడుతూ.. బీసీలకు న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ కోసం 40 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ 42శాతం రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీసీలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు మోసం చేసి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో బీసీ సంఘాలు ఊరుకునేది లేదని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అఖిలపక్ష రాష్ట్ర రాజకీయ నాయకులను ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లి మాట్లాడి ఒప్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ఇండియా కూటమితో రాహుల్ గాంధీతో మాట్లాడించి శీతాకాల పార్లమెంట్ సమావేశంలో బీసీల 42శాతం రిజర్వేషన్ల పై చర్చించాలన్నారు. కార్యక్రమంలో నల్లగుంట్ల అయోధ్య, ఆకుల లవకుశ, నేరెళ్ల మధు, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్ నాయుడు, నారబోయిన వెంకట్, కునుకుంట్ల సైదులు, బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, కోడి లింగ యాదవ్, తన్నీరు వాసుదేవ్, పోలబోయిన కిరణ్, బడుగు లక్ష్మీనారాయణ విద్యార్థులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
