సూర్యాపేట, వెలుగు: డ్యూటీ సమయంలో విధులకు హాజరు కానీ ఆరుగురు డాక్టర్లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా పాలన - ప్రగతి నివేదికలో భాగంగా సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో బయోమెట్రిక్ హాజరును పరిశీలించగా మొత్తం 50 మంది బోధనా సిబ్బంది , ఇతర సిబ్బంది విధులకు గైర్హాజరైనట్లు కలెక్టర్ గుర్తించి, హెచ్ఓడీలను వివరణ అడిగారు.
అందులో 44 మంది సిబ్బందికి సంబంధించి హెచ్ఓడీలు కారణాలను తెలియజేశారు. మిగిలిన 6 మంది డాక్టర్లు గైర్హాజరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వారిని సస్పెండ్ చేశారు. సిబ్బంది ఖచ్చితంగా బయోమెట్రిక్ నమోదు చేయాలని ఆదేశించారు.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నూతనంగా నిర్మించిన ఎం.సి.హెచ్ బ్లాక్ పనులు దాదాపు పూర్తయ్యాయని , ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. మాతా శిశు కేంద్రంలో నెలకు సగటున 240 నుండి 300 ప్రసవాలు జరుగుతుండటంపై సిబ్బందిని అభినందించారు. ప్రశంసించారు..కలెక్టర్ వెంట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రవణ్ కుమార్
పాల్గొన్నారు.
