సూర్యాపేట, వెలుగు: ఢిల్లీ నుండి గల్లీ వరకు ముస్లింలకు అండగా నిలబడేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.భారతదేశంలో సర్వమతాలను సమానంగా చూస్తూ వారి వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పార్టీ కుడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే నని ఆయన స్పష్టం చేశారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారతదేశంలో సెక్యులరిజానికి పెద్ద పీట వేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే నన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో షాదీఖాన, కమ్యూనిటి హల్, ఖబరస్తాన్ వంటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని మంత్రి ప్రకటించారు. అంతకముందు సూర్యాపేటలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు శంఖుస్థాపన చేశారు. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత సర్వోత్తం రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, మున్సిపల్ చైర్మన్ మోరిశెట్టి నివేదితా లక్షాది, పిసిసి కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు తదితరులుఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
