వారం లోపు బీసీలకు రూ. లక్ష చెక్కులు ఇస్తాం: గంగుల

వారం లోపు  బీసీలకు రూ. లక్ష చెక్కులు ఇస్తాం: గంగుల
  • రెండు రోజుల్లో మైనార్టీ బంధు విధివిధానాలు ఖరారు : గంగుల
  •     రేషన్ కార్డు ఉన్న వారంతా గృహలక్ష్మి స్కీమ్ కు అర్హులే
  •     తెల్ల కాగితంపైనా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడి

కరీంనగర్, వెలుగు: జిల్లాలో బీసీ కులవృత్తుల చేయూత పథకం చెక్కులను ఈనెల 15వ తేదీలోపే పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ, సివిల్ సప్లై శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. మైనార్టీ బంధు విధివిధానాలను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి, దళితబంధు, బీసీ కులవృత్తులకు చేయూత, సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాలపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో కలిసి ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. పథకాల అమలును యుద్ధ ప్రాతిపదికన చేపట్టి లబ్ధిదారులకు అందించాలని సూచించారు. గృహలక్ష్మి పథకం నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాన్ని అమలు చేస్తామన్నారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అంటూ ఏదీ లేదని.. సోషల్ మీడియాలో వైరలవుతున్న ఫారమ్ తో ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. తెల్లకాగితంపై రాత పూర్వకంగా దరఖాస్తు రాసి, ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీకార్డుతో కలిపి తహసీల్దార్ కు అందిస్తే వారు కలెక్టర్ కు అందిస్తారని చెప్పారు. గ్రామకంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు కాబట్టి ఇంటి నంబర్ వేసినా సరిపోతుందని, ఖాళీ స్థలం ఉన్నా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. రెండో విడత దళిత బంధు కింద నియోజకవర్గానికి 1,100 యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. 

కేబుల్ బ్రిడ్జిపై వీకెండ్​లో సండే ఫన్ డే

ఇకపై ప్రతీ శని, ఆదివారం సండే ఫన్ డే పేరుతో కేబుల్ బ్రిడ్జి వద్ద వాహనాల రాకపోకలను ఆపేసి ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. అలాగే, ఆగస్టు 15న సాయంత్రం కేబుల్ బ్రిడ్జిపై కల్చరల్ యాక్టివిటీస్ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, నగర మేయర్ వై సునీల్ రావు,  ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, సతీశ్​కుమార్, కలెక్టర్ డాక్టర్ బి.గోపి, 
తదితరులు పాల్గొన్నారు.