- నిర్మాణ్ ఎన్జీవోతో ఎంవోయూ
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల విద్యార్థుల్లో ఎంప్లాయిమెంట్ స్కిల్స్, లీడర్ షిప్ క్వాలిటీస్ పెంచాలని సొసైటీ నిర్ణయించింది. గురువారం నిర్మాణ్ ఎన్జీవోతో ఎంవోయూ కుదర్చుకుంది. అందులో భాగంగా గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు, నిర్మాణ్ సీఈవో మయూర్ పట్నా ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు మాట్లాడారు. బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా, ఉపాధి నైపుణ్యాలు మెరుగుపర్చేలా అవగాహన కల్పించేందుకు వీలుగా నిర్మాణ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఈ సంస్థ సహకారంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో పాటు ఉపాధి నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతారని ఆయన ఆకాంక్షించారు.
అనంతరం సీఈవో మయూర్ పట్నా మాట్లాడారు. 2005లో బిట్స్ పిలానీలో చదివే స్టూడెంట్లతో నిర్మాణ్ సంస్థ స్టార్ట్ అయిందని, గత రెండు దశాబ్దాలుగా ఈ సంస్థ జాతీయస్థాయిలో విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో పని చేస్తుందని చెప్పారు. బీసీ గురుకుల విద్యార్థుల శ్రేయస్సు కోసం పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ గురుకుల ప్రతినిధులు, నిర్మాణ్ నిర్వహకులు సుచిత్ర, శాంత కుమార్ చిలుముల, ఉషాకర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు.
