చల్లబడ్డ చమురు ధరలు.. 88 డాలర్లకు దిగొచ్చిన బ్యారెల్

చల్లబడ్డ చమురు ధరలు.. 88 డాలర్లకు దిగొచ్చిన బ్యారెల్

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం త్వరలో ముగియవచ్చని యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మంగళవారం చమురు ధరలు భారీగా పడిపోయాయి. అంతకుముందు సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇవి మూడేళ్ల గరిష్టానికి చేరినప్పటికీ ట్రంప్ కామెంట్స్‎తో అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ధర 11 శాతం తగ్గి బ్యారెల్‌‌‌‌‌‌‌‌కు 88.36 డాలర్లకు చేరింది. యూఎస్ క్రూడ్ ధర 10 శాతం పైగా క్షీణించి 85.17 డాలర్ల వద్ద నిలిచింది. 

సోమవారం ఒక దశలో వీటి ధరలు 119.50 డాలర్ల గరిష్ట స్థాయిని తాకాయి. డబ్ల్యూటీఐ క్రూడ్ కూడా 119.48 డాలర్లకు చేరి 2022 నాటి రికార్డును నమోదు చేసింది. సౌదీ అరేబియా ఇతర ఉత్పత్తి దేశాలు సరఫరాలో కోత విధించడం వల్ల మార్కెట్లో అస్థిరత నెలకొంది.  యుద్ధం సరఫరాకు విఘాతం కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు భయపడ్డాయి.

రష్యాపై ఆంక్షలు సడలించడం, అత్యవసర చమురు నిల్వలను విడుదల చేయడం వంటి ప్రతిపాదలను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.  రాబోయే రోజుల్లో ధరలు 75 డాలర్ల నుంచి 105 డాలర్ల మధ్య ఊగిసలాడే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు ఇప్పటికే ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. ధరల పెరుగుదలపై జీ7 దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపాయి.  

నాలుగేళ్ల గరిష్టానికి అల్యూమినియం ధరలు

ఈ యుద్ధం వల్ల అల్యూమినియం రంగానికి భారీ ముప్పు ఏర్పడింది. ధరలు గత నాలుగు ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధి మూతపడటంతో గల్ఫ్ దేశాల నుంచి జరిగే వాణిజ్యం పూర్తిగా ఆగింది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌లో అల్యూమినియం ధర టన్నుకు 3, 544 డాలర్లకు చేరింది. గల్ఫ్‎కు ప్రపంచ అల్యూమినియం ఉత్పత్తిలో 8 శాతం వాటా ఉంది.

బహ్రెయిన్, ఖతార్, సౌదీ, యూఏఐ నుంచి ఏటా 50 లక్షల మెట్రిక్ టన్నులు యూరప్,​ అమెరికాకు సరఫరా అవుతుంది. ప్రస్తుత యుద్ధం వల్ల ఈ సరఫరా గొలుసు తీవ్రంగా దెబ్బతింది.  బాక్సైట్, అల్యూమినా దిగుమతులు కూడా ఆగిపోవడంతో గల్ఫ్​లోని స్మెల్టర్లు మూతపడుతున్నాయి. ఖతర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కటాలమ్ సంస్థ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఉత్పత్తిని నిలిపివేసింది.

ఈ ప్లాంటు తిరిగి పూర్తి స్థాయిలో పనిచేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చని అంచనా. అల్యూమినియం మార్కెట్ ఇప్పటికే చైనా ఉత్పత్తి పరిమితులు, రష్యాపై ఆంక్షల వల్ల ఒత్తిడిలో ఉంది.  యూరప్​కు 30 శాతం దిగుమతులు గల్ఫ్​ నుంచే వస్తున్నాయి. అమెరికా కూడా 20 శాతం దిగుమతులను ఈ ప్రాంతం నుంచే పొందుతోంది. 

దీనివల్ల చాలాదేశాల్లో ఉత్పత్తి వ్యయం పెరిగే అవకాశం ఉంది.  మనదేశంలో హిందాల్కో, వేదాంత వంటి సంస్థలకు సొంతంగా బాక్సైట్ నిల్వలు ఉన్నాయి. ఇవి సొంతగా ఉత్పత్తి చేస్తున్నాయి కాబట్టి భారత్‌‌‌‌‌‌‌‌కు అల్యూమినియం కొరత ఏర్పడే అవకాశం తక్కువని ఎక్స్​పర్టులు చెబుతున్నారు. ---