- బస్సుల పూర్తి వినియోగానికి ప్రత్యామ్నాయం వెతకాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి మరింత విస్తృతంగా పబ్లిసిటీ చేయాలని అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. బోటింగ్ సౌకర్యాలు, కాటేజీలు, వ్యూ పాయింట్లు, హరిత హోటల్నిర్వహణను మరింత మెరుగుపరచాలని ఆదేశించారు. అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో సౌకర్యాలు పెంచి, పర్యాటకులను ఆకర్షించేలా కొత్త ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన హిమాయత్ నగర్ లోని రాష్ట్రపర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) కార్యాలయంలో సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి ఇతర ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
ప్రధాన పర్యాటక ప్రాంతాల రూట్లలో నడుస్తున్న బస్సుల వివరాలు, ఆదాయంపై మంత్రి ఆరా తీశారు. తిరుమల దర్శనం ప్యాకేజీలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఆదాయం తగ్గిందని అధికారులు చెప్పడంపై మంత్రి జూపల్లి తీవ్రంగా స్పందించారు."కోట్లాది రూపాయలతో కొనుగోలు చేసిన బస్సులను నిరుపయోగంగా ఉంచితే లాభం ఏమిటి?" అని అధికారులను ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలే తప్ప సాకులు చెప్పవద్దని హెచ్చరించారు.
రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు టూరిస్ట్‌లు సులభంగా చేరుకునేలా ఆయా రూట్లలో వెంటనే డైరెక్షన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.తెలంగాణ పర్యాటకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రత్యేక బ్రాండింగ్ , ప్రమోషన్, ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా చేపట్టిన సుమారు 84 ప్రాజెక్టుల పురోగతిపై కూడా మంత్రి సమీక్షించారు. టెండర్ల దశలో ఉండి, ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే మొదలుపెట్టాలని ఆదేశించారు
