- తెలంగాణ విద్యా విధానం-2026 విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు
- ఓయూలో తెలంగాణ విద్యా విధానంపై రౌండ్ టేబుల్ సమావేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్‌లో అర్బన్ నక్సల్స్ ఉన్నారని, వారి ద్వారా తయారయ్యే నివేదిక విద్యా వ్యవస్థను అంధకారంలోకి నెట్టేలా ఉందని బీజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అలాంటి వ్యక్తులతో తెలంగాణ విద్యా విధానం-2026 పేరిట రిపోర్ట్ తయారు చేయించడం విద్యార్థుల భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో ‘తెలంగాణ విద్యా విధానం– 2026’అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యా విధానం పేరుతో విద్యార్థులపై వామపక్ష భావజాలాన్ని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విద్యావంతులు, నిపుణులతో సంప్రదింపులు జరపకుండానే ఈ డ్రాఫ్ట్ తయారు చేశారన్నారు. భారతీయ సంస్కృతికి, విలువలకి నిలయమైన సంస్కృత భాషను విద్యా విధానం నుంచి తొలగించాలని కమిషన్ సూచించడం దుర్మార్గమని మండిపడ్డారు. మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తూనే, ప్రాచీన భాషా సంస్కృతిని కాపాడాలని, కానీ కమిషన్ రిపోర్ట్ ఇందుకు విరుద్ధంగా ఉందన్నారు.
టీచర్ల జీతాల్లో కోత విధించాలని కమిషన్ సూచించడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో సర్కారు బడుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కారణంగా 44 మంది విద్యార్థులు మృతి చెందడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. దేశమంతా ఎన్ఈపీని అనుసరిస్తుంటే, తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యా విధానంపై ఏకపక్ష నిర్ణయాలు సరికాదు: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
విద్యా విధానం రూపకల్పనలో ఏకపక్ష నిర్ణయాలు సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య అభిప్రాయపడ్డారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని, వాటిని రాష్ట్ర కమిషన్ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. విద్యా నిపుణులతో చర్చించాకే నూతన విద్యా విధానంపై ప్రభుత్వం ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. టీజీసీహెచ్ఈ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి మాట్లాడుతూ.. విద్యా కమిషన్ నివేదికలో స్పష్టమైన లక్ష్యాలు కనిపించడం లేదని, దీన్ని సవరించాల్సిన అవసరం ఉందన్నారు.
టీచర్లు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే నేషన్ బిల్డర్స్ అని, వారి పాత్రను తక్కువ చేయొద్దని సూచించారు. ఓయూ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ టి.తిరుపతి రావు మాట్లాడుతూ.. విద్యా కమిషన్ సూచనలు గందరగోళంగా ఉన్నాయని విమర్శించారు. ఒకవైపు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లను రిక్రూట్ చేయాలని చెబుతూనే, మరోవైపు స్కూల్ టీచర్ల జీతాలు ఎక్కువని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో 80 శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ప్రొఫెసర్ పి.మురళి మనోహర్, తపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ పాల్గొన్నారు.
