- మహిళా బిల్లులో బీసీ సబ్ కోటా కల్పించాలి : జాజుల
- గన్ పార్క్ అమరవీరుల స్తూపం ఎదుట ధర్నా
సైఫాబాద్, వెలుగు: ప్రధాని మోదీ తడిగుడ్డతో బీసీల గొంతు కోస్తున్నారని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. మోదీ బీసీ అయ్యుండి.. బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. సోమవారం బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు బి.మని మంజరి సాగర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 274 ఎంపీ స్థానాలను పెంచుతున్నారని ... ఆ స్థానాలు కూడా అగ్రకులాల మహిళలకే కేటాయిస్తారని ఆరోపించారు. ఈ నెల 16న ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్, బీసీ సంఘ నేతలు తారకేశ్వరి, కుందారం గణేశ్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ సంధ్యారాణి, తాటికొండ విక్రమ్ గౌడ్ సుజాత, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

