బీసీలను కాంగ్రెస్ మళ్లీ దగా చేస్తున్నది.. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలను కాంగ్రెస్ మళ్లీ దగా చేస్తున్నది.. బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
  • 42 శాతం రిజర్వేషన్ల తర్వాతే మున్సిపల్ ఎన్నికలకు పోవాలి
  • లేదంటే కాంగ్రెస్​ను బీసీలు ఇక జన్మలో నమ్మరు
  • బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల హెచ్చరిక

ట్యాంక్ బండ్, వెలుగు: మేడారంలో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై కనీసం చర్చించకుండా మున్సిపల్ ఎన్నికలకు పోవాలని నిర్ణయించడం బీసీలను మరోసారి దగా చేయడమేనని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా మండిపడ్డారు. 

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్​లోయర్ ట్యాంక్ బండ్​లోని అంబేద్కర్ విగ్రహం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను నమ్మించి దగా చేస్తున్నదని, గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని నిర్ణయించడం తడి గుడ్డతో గొంతు కోయడమేనని విమర్శించారు. 

బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయన్నారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చిన అఖిలపక్షాలు ఇప్పుడు మౌనం పాటిస్తుండడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చట్టపరంగా  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతే క్షమాపణ చెప్పి, పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం 56 శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

 లేకపోతే కాంగ్రెస్​ను బీసీలు ఇక జన్మలో నమ్మరని, తెలంగాణలో కాంగ్రెస్ ముగిసిన అధ్యాయమవుతుందని హెచ్చరించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని, రెండు రోజుల్లో జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. 

ఈ నిరసనలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, కో-చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.