- భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా పక్షపాత ధోరణితో వ్యవహరించడం వల్లే తాము ఈ బడ్జెట్ సెషన్ మొత్తం సస్పెన్షన్‌కు గురయ్యామని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని మకర ద్వారం వద్ద సస్పెన్షన్‌కు గురైన ఎనిమిది మంది ఎంపీలు నిరసన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూనే తాము వెల్‌లోకి వెళ్లి ప్రశ్నించామని ఎంపీ గుర్తు చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపినప్పటికీ, తమను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. స్పీకర్ వ్యవహారశైలికి వ్యతిరేకంగానే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయని, ఈ చర్చలో పాల్గొనేందుకు తమపై ఉన్న సస్పెన్షన్‌ను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదని తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో తమకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు.
