- బీసీ నేత ఆర్. కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం జాతీయ స్థాయిలో మద్దతు కూడా కడతామని బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అమలు కానందున రాష్ట్రంలో ఇప్పటికే బీసీ ఉద్యమం మొదలైందని, బీసీ వాదం ఎత్తుకుంటేనే రాజకీయ పార్టీలకు మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ లో సి.రాజేందర్ అధ్యక్షతన బీసీ జాతీయ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి కృష్ణయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ హాజరై నేషనల్ బీసీ యూత్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులుగా కిశోర్ యాదవ్ ను నియమించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
హామీ ఇచ్చి అమలు చేయకుండా బీసీలను, బీసీ వాదాన్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటున్నదని చెప్పారు. ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశాన్ని దాటవేస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఏ ఎన్నికల్లో అయినా బీసీలే అత్యధికంగా గెలుస్తున్నా రిజర్వేషన్లను అమలు చేయడంలో ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్, బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని తెలిపారు.
