బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన వాటా ఇవ్వడం లేదు

బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన వాటా ఇవ్వడం లేదు

న్యూఢిల్లీ, వెలుగు: అన్ని రకాలుగా అన్యాయా నికి గురవుతున్న బీసీలకు న్యాయం చేయాల ని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీసీ నేతలు కోరారు. మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌‌లో ద్రౌపదిని ఎంపీ ఆర్‌‌‌‌.కృష్ణయ్య 
నేతృత్వంలోని బీసీ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందజేశారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, దీనిపై జోక్యం చేసుకొని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగ రంగంలో 9 శాతం, ప్రైవేటు రంగంలోని ఉద్యోగాల్లో 5 శాతం, ఉన్నత న్యాయ స్థానాల్లో 2 శాతం, పారిశ్రామిక రంగంలో ఒక శాతం మాత్రమే బీసీల ప్రాతినిధ్యం ఉన్నట్లు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని ఆర్‌‌‌‌.కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో చేపట్టే జనాభా లెక్కల్లో కులాల లెక్కలు తీయాలని కోరామన్నారు. బీసీలు ఓట్లు వేసి అధికారం ఇస్తున్నారు కానీ, అధికారంలో మాత్రం బీసీలకు వాటా ఇవ్వడం లేదని తెలిపారు.