- నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదు: బీసీ నేతల ఫైర్
- బీసీ మేధావుల ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిరాహార దీక్ష
- మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ మధుసూదనాచారి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బీసీలకు బడ్జెట్లో సమాన వాటా దక్కేంతవరకు పార్టీలకతీతంగా పోరాటం చేస్తామని పలువురు బీసీ నాయకులు స్పష్టం చేశారు. నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తే సహించేది లేదని.. న్యాయం కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు బీసీ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్ రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ఈటల రాజేందర్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలను పాలకులు ఓటర్లుగానే చూస్తున్నారు తప్ప వాటా దారులుగా గుర్తించడం లేదన్నారు. నిధులు, విధి విధానాలు లేక కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్లు దివాలా తీశాయన్నారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. బీసీల పోరాటాలు ఒక పార్టీని గద్దెదించి మరొక పార్టీని అధికారంలోకి తేవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయని.. రాజ్యాధికారం దిశగా ముందుకు సాగడం లేదన్నారు. 3 శాతం ఉన్న అగ్రవర్ణాలు చట్ట సభల్లో ఉంటే.. 90 శాతం ఉన్న దళిత బహుజనులు ఇందిరాపార్క్ వద్ద ధర్నాలకే పరిమితమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీసీలు మొమోరాండాలు ఇచ్చే పనులు మానుకొని.. ఐక్యంగా రాజ్యాధికారం దిశగా పయనించాలని.. బీసీల కోసం జరిగే ఏ ఉద్యమానికైనా తాను ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తానని ఈటల హామీ ఇచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో బీసీలకు నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా లేకుండా పోయిందన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలపై రాష్ట్రంలో జరుగుతున్న దాడులు దౌర్జన్యాలు అంతా ఇంతా కాదని అన్నారు. బీసీల కోసం జరిగే పోరాటంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులతో కలిసి వస్తుందని ఆయన
హామీ ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా పోరాడాలి..
తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా బీసీలు తమ న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి పోరాడాలని బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. మాజీ డీజీపీ పూర్ణచందర్రావు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్ రాజ్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లను బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చిన 21 హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. గత బడ్జెట్లో ఓసీలకు కేటాయించిన నిధుల పట్ల వైట్పేపర్ విడుదల చేయాలన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో బీసీలపై జరిగిన అమానవీయ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, ఎ. విజయ్ కుమార్ గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గయ్య గౌడ్, మేధావుల ఫోరం నేతలు ఎర్ర మధు వెంకన్న, శేఖర్, అంబాల నారాయణ గౌడ్, దాసోజు లలిత, పొన్నం దేవరాజు, కీర్తిలాల్ తదితరులు పాల్గొన్నారు.
