- ఆల్ పార్టీ నేతలకు బీసీ నేతల వినతి
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును కలిసి వినతిపత్రాలు అందజేశారు.
బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర అసెంబ్లీలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలన్న డిమాండ్‌తో సీఎం నేతృత్వంలో అఖిలపక్షాన్ని ప్రధాని మోదీతో సమావేశపర్చాలని నేతలు కోరారు. బీసీ జేఏసీ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు.
