- బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తం
- ఈ అంశంలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీని కలుస్తం
- వచ్చే నెలలో వరుస ఆందోళనలు చేపడతామని జేఏసీ నేతల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమ తరహలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని చేపట్టి, బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధించే వరకు ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని బీసీ జేఏసీ నేతలు వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వచ్చే వరకు బీసీల పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ అంశంపై వచ్చే నెలలో బిహార్ ఎన్నికలు ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలుస్తామని చెప్పారు.
ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో చైర్మన్ దాసు సురేశ్, కోఆర్డినేటర్ గుజ్జ కృష్ణ మీడియాతో మాట్లాడారు.
జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 18న నిర్వహించిన రాష్ట్ర బంద్ చరిత్ర సృష్టించిందని, తెలంగాణలో ఉన్న బీసీల బలమేందో బలగమేందో దేశం మొత్తం చూసిందని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లీ వరకు ఉధృతం చేయడానికి వచ్చే నెల 2న హైదరాబాద్‌లోని కళింగ భవన్‌లో బీసీ జేఏసీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే, నవంబర్ రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపడతామని, మూడో వారంలో పల్లె నుంచి పట్నం వరకు భారీ ర్యాలీలు, ప్రదర్శనలు చేపడతామని ఆయన తెలిపారు.
అందరినీ కలుపుకుపోతం..
రాజకీయ పార్టీలకతీతంగా బీసీ జేఏసీని విస్తృతపరిచి కలిసి వచ్చే వాళ్లందరినీ కలుపుకొని, తెలంగాణ ఉద్యమ తరహలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని నిర్వహిస్తామని వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని తెలిపారు. బీసీ రిజర్వేషన్లను పెంచడానికి రాజ్యాంగ సవరణ ఒకటే పరిష్కార మార్గమన్నారు. బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్ మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధన కోసం బీసీ జేఏసీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని చేపడుతోందన్నారు.
తమతో కలిసివచ్చే రాజకీయ పార్టీలు, సంస్థలు, ప్రజాస్వామ్య లౌకిక శక్తుల మద్దతు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రైలు రోకో, రహదారుల దిగ్బంధం లాంటి కార్యక్రమాలు చేపట్టి బీసీ రిజర్వేషన్లు సాధిస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ నాయక్, గూడూరు భాస్కర్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
