- కామారెడ్డి డిక్లరేషన్లోని హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్
- తీన్మార్ మల్లన్న, జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు హాజరు
బషీర్‌బాగ్, వెలుగు: వచ్చే క్యాబినెట్ మీటింగ్‌లో బీసీ సబ్ ప్లాన్ ప్రకటించి, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బడ్జెట్లో బీసీలకు వాటా కేటాయించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌తో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రం వస్తే బీసీల బతుకులు మారుతాయని భావించినా మారలేదన్నారు. జనాభాలో బీసీల వాటాకు తగ్గట్లుగా బడ్జెట్లో వారి సంక్షేమానికి నిధులు కేటాయించడం లేదని, కేటాయించిన అరకొర నిధులను కూడా ఇతర స్కీములకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.
2014 నుంచి 2025 వరకు బీసీలకు కేటాయించిన రూ. 10,241కోట్లను పక్కదారి పట్టించారని అన్నారు. సర్కారు బడుల్లో పేద ఆడ పిల్లలకు ఇచ్చే శానిటరీ ప్యాడ్ల బిల్లుల్లో రూ.44 కోట్లు తిన్నారని మండిపడ్డారు. లోకల్‌బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు రిజర్వేషన్లు అడిగితే పార్టీ పరంగా టికెట్లు ఇచ్చామని చెప్తోందన్నారు. 2028లో బీసీ ప్రభుత్వం రాబోతోందని, చిట్టచివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అవుతారని తీన్మార్ మల్లన్న జోస్యం చెప్పారు. బీసీలకు జరుగుతున్న ఈ అన్యాయంపై బీసీ మంత్రులు గళం ఎత్తాలని, అది సాధ్యం కాకుంటే వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు.
బీసీలకు1.80 లక్షల కోట్లు కేటాయించాలి:
నిరసన సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మూడోసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్న కాంగ్రెస్ సర్కారు బీసీ సబ్ ప్లాన్ గురించి పట్టించుకోవడం లేదన్నారు. పేరుకు మాత్రం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం అని అంటున్నారు కానీ, నిధుల కేటాయింపులో సామాజిక న్యాయం అమలుకావడం లేదన్నారు.
రూ. 3 లక్షల 56 వేల కోట్ల బడ్జెట్ ఉంటే బీసీలకు లక్షా 80 వేల కోట్లు కేటాయించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ ఉద్యమాన్ని గ్రామాల్లోకి తీసుకెళ్తామని, అవసరమైతే రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తామని జాజుల హెచ్చరించారు. ఈ నెల 26న జరిగే బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నిరసనలో మాజీ ఐఏఎస్ చిరంజీవులు, బీసీ నేతలు గుజ్జ కృష్ణ, జానయ్య తదితరులు పాల్గొన్నారు.
బీసీలను రాజకీయంగా అణచివేస్తే సహించం: జాజుల
హైదరాబాద్/పంజాగుట్ట, వెలుగు: బీసీలను రాజకీయంగా అణిచివేయాలని చూస్తే సహించేది లేదని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ బీసీ వ్యతిరేకులకు నిలయంగా మారుతోందని, అందుకే బీసీలను అణచివేస్తున్న మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బుట్టంగారి మాధవరెడ్డి పక్షాన ఆ పార్టీ నిలబడుతోందన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల యాదగిరితో కలిసి జాజుల మాట్లాడారు.
‘‘ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో జనరల్ స్థానం నుండి కౌన్సిలర్‌గా గెలిచిన యాదగిరి, తన సీనియారిటీని బట్టి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. అయితే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు కలిసి ‘నీవు బీసీవి, జనరల్ సీటులో నీకెందుకు పదవి ఇస్తాం?’ అంటూ కులపరంగా అవమానించడమే కాకుండా, యాదగిరిని కిడ్నాప్ చేసి శారీరకంగా, మానసికంగా హింసించారు”అని ఆరోపించారు.
మంచిరెడ్డిని తక్షణమే పార్టీ నుండి బహిష్కరించాలని, యాదగిరిపై కిడ్నాప్, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ నాయకుడికే ఇవ్వాలన్నారు. బాధిత కౌన్సిలర్ ఆకుల యాదగిరి మాట్లాడుతూ.. "పదవి కోసం ఎన్ని కోట్లు ఇస్తావు?" అని మంచిరెడ్డి అడిగారని చెప్పారు.
బీఆర్ఎస్ కౌన్సిలర్‌పై సొంత పార్టీ నేతలే దాడి చేసి, విషయం హైకోర్టు వరకు వెళ్లినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ సంఘాల నేతలు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యామ్ కుర్మా, బి. మణి మంజరి సాగర్, గొడుగు మహేష్ యాదవ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
