జనాభా ప్రకారం  బీసీలకు రిజర్వేషన్లు  కల్పించాలె

జనాభా ప్రకారం  బీసీలకు రిజర్వేషన్లు  కల్పించాలె
  •     కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్​కు బీసీ నేతల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు : పార్లమెంట్​లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘాల నేతలు కేంద్రాన్ని కోరారు. అలాగే, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాలు కేంద్ర మంత్రి  భూపేందర్ యాదవ్ ను కలిసి వినతి పత్రం అందించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. స్థానిక సంస్థలలో ఆయా రాష్ట్రాలలో 18 నుంచి 22 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు.  అలాగే, కేంద్ర విద్య, ఉద్యోగాలలో బీసీలకు రిజర్వేషన్లు కేవలం 27 శాతం మాత్రమే ఉన్నాయని చెప్పారు.

అందువల్ల బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 56 శాతానికి పెంచాలని, ఇందుకోసం రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు. రాజ్యాంగంలోని 15(4), 16(4) ఆర్టికల్స్ లో జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉందన్నారు. అలాగే, బీసీ డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తులపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు కృష్ణయ్య మీడియాకు వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, నందగోపాల్, టి.రాజ్ కుమార్, గోవింద్, భాషయ్య, పరషురామ్ తదితరులు ఉన్నారు.