గురుకులాల విలీనం ఆపండి:ఆర్.కృష్ణయ్య

గురుకులాల విలీనం ఆపండి:ఆర్.కృష్ణయ్య

మంత్రి పొన్నం ప్రభాకర్​కు ఆర్.కృష్ణయ్య వినతి

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు బ్రహ్మాండంగా నడుస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. వీటి విలీన ప్రతిపాదనను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలను సమగ్ర గురుకుల పాఠశాలలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అన్యాయమని, అలాచేసి విద్యా వ్యవస్థను డిస్టర్బ్ చేయవద్దని కోరారు.

ఈమేరకు శనివారం ఆయన వివిధ బీసీ సంఘాల నాయకులతో  సెక్రటేరియెట్ వెళ్లి మంత్రి పొన్నం ప్రభాకర్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. గురుకులాలను అన్నింటిని విలీనం చేయాలని ఏ సంఘం, పార్టీ, కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదన్నారు. మరి ఎందుకు విలీన ప్రతిపాదన చేస్తున్నారని ప్రశ్నించారు. దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు కేంద్రం 60% నిధులు గ్రాంట్ ఇస్తుందని మైనార్టీ భవన నిర్మాణాలకు 80%, ఇతర ఖర్చులకు 40% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని అలాంటప్పుడు బీసీలకు ఎలాంటి సాయం ఉండదని వివరించారు.  ఇలాంటి పరిస్థితిలో ఎలా కలుపుతారని నిలదీశారు.