న్యూఢిల్లీ: టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఊహించినట్టుగానే కిందకు పడిపోయారు. సోమవారం ప్రకటించిన 2025–26 సీజన్ వార్షిక కాంట్రాక్టుల్లో ఈ ఇద్దరినీ ఎ–ప్లస్ నుంచి గ్రేడ్-–బికి మారుస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
అంతేకాకుండా ఇప్పటివరకు క్రికెటర్లకు అత్యధిక శాలరీ (ఏటా రూ. 7 కోట్లు) ఇస్తున్న ఎ–ప్లస్ కేటగిరీని పూర్తిగా రద్దు చేసింది. మెన్స్‌లో 30 మంది, అమ్మాయిల విభాగంలో 21 మంది క్రికెటర్లకు ఎ, బి, సి గ్రేడ్లలో కాంట్రాక్టులను కేటాయించింది. గత సీజన్‌లో ప్లేయర్ల పెర్ఫామెన్స్, వాళ్లు ఆడిన ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా ఈ గ్రేడ్లను నిర్ణయించింది.
గ్రేడ్-ఎలో గిల్, బుమ్రా, జడేజా .. షమీకి నో కాంట్రాక్ట్
కొత్త జాబితా ప్రకారం శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే గ్రేడ్–ఎలో చోటు దక్కించుకున్నారు. గతంలో గ్రేడ్–ఎ ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్–బికి రూ. 3 కోట్లు, గ్రేడ్–సికి రూ. 1 కోటి చొప్పున చెల్లించేవారు. అయితే ఈసారి వేతనాల వివరాలను బోర్డు స్పష్టంగా వెల్లడించలేదు. ఇక, కోహ్లీ, రోహిత్ టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ఇచ్చి ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నారు.
రూల్స్ ప్రకారం మూడు ఫార్మాట్లలో ఆడేవారికి మాత్రమే టాప్ గ్రేడ్ ఇస్తారు. అందుకే వీరిని గ్రేడ్–బికి మార్చారు. మూడు ఫార్మాట్లలో రాణించే వారి కోసం ఎంఎస్ ధోనీ హయాంలో ‘ఎ ప్లస్’ కేటగిరీని తీసుకొచ్చారు. ఇప్పుడు స్టార్లందరూ వివిధ ఫార్మాట్ల నుంచి వైదొలగడంతో ఆ కేటగిరీని బీసీసీఐ తొలగించింది. గతేడాది 34 మందికి కాంట్రాక్టులు ఉండగా బోర్డు ఈసారి ఆ సంఖ్యను 30కి కుదించింది.
వెటరన్ పేసర్ మహ్మద్ షమీతో పాటు ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్‌కు ఈ జాబితాలో చోటు దక్కలేదు. గత సీజన్‌లో వీళ్లు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడకపోవడమే ఇందుకు కారణం. షమీ ఇకపై సెలెక్టర్ల ప్రణాళికల్లో లేడని దీని ద్వారా స్పష్టమవుతోంది. మరోవైపు రెగ్యులర్‌గా వన్డేలు, టీ20లు ఆడుతున్న సీనియర్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను గ్రేడ్–సికి పరిమితం చేయడం ఆశ్చర్యం కలిగించింది.
జెమీమాకు ప్రమోషన్
అమ్మాయిల జాబితాలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, స్మృతి మంధాన తమ టాప్ కేటగిరీని నిలబెట్టుకున్నారు. ఆస్ట్రేలియాపై టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అద్భుత సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్‌కు గ్రేడ్–బి నుంచి ‘ఎ’కి ప్రమోషన్ లభించింది. స్నేహ రాణా, షెఫాలీ వర్మ, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్ గ్రేడ్-బిలో ఉన్నారు. విమెన్స్ కాంట్రాక్టుల్లో ప్రస్తుతం గ్రేడ్ల వారీగా రూ. 50 లక్షలు, రూ. 30 లక్షలు, రూ. 10 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు.
