
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ ఖజానా అంతకంతకూ పెరుగుతోంది. గత ఐదేండ్లలోనే బోర్డు సంపద ఏకంగా రూ. 14,627 కోట్లు పెరిగినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఐపీఎల్, ఐసీసీ నుంచి వస్తున్న భారీ నిధులు, పక్కా ప్రణాళికల వల్లే బోర్డు భారీగా ఆర్జిస్తోందని తెలుస్తోంది.
గతేడాది జరిగిన ఏజీఎంలో స్టేట్ క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ అందజేసిన నివేదిక ప్రకారం 2019లో బోర్డు ఖజానాలో (బ్యాంకుల్లో) రూ. 6,059 కోట్లుగా ఉన్న నిల్వలు, 2024 నాటికి రూ. 20,686 కోట్లుకు చేరుకున్నాయి. ఇది అన్ని బకాయిలను చెల్లించిన తర్వాత నమోదైన గణాంకాలు కావడం విశేషం.2019లో రూ. 3,906 కోట్లుగా ఉన్న జనరల్ ఫండ్ ఇప్పుడు రెట్టింపై రూ. 7,988 కోట్లకు పెరిగింది.
ఈ నెల 28న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో పూర్తి ఆర్థిక వివరాలను బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. ఈ ఏడాది కాలంలో బోర్డు సంపద మరింతగా పెరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2023–-24 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐకి రూ. 1,623.08 కోట్ల మిగులు ఆదాయం లభించింది. ఇక, బీసీసీఐ ఆదాయపు పన్ను చెల్లించదనే అపోహను ఈ నివేదిక తొలగించింది.
2023-–24 సంవత్సరానికి పన్ను చెల్లింపుల కోసం రూ. 3,150 కోట్లను కేటాయించినట్లు బోర్డు పేర్కొంది. కాగా, సంపాదించిన ఆదాయంలో బీసీసీఐ భారీ మొత్తం క్రికెట్ అభివృద్ధికి ఖర్చు చేస్తోంది. 2023-–24 సంవత్సరానికి గాను స్టేట్ అసోసియేషన్లకు రూ. 1,990.18 కోట్లు పంపిణీ చేసింది. మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 1,200 కోట్లు, మాజీ క్రికెటర్ల సంక్షేమం కోసం రూ. 350 కోట్లు, క్రికెట్ అభివృద్ధికి రూ. 500 కోట్లు కేటాయించింది.