ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సగం స్థానాలకు మించి బీసీల పోటీ

 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో  సగం స్థానాలకు మించి బీసీల పోటీ
  •  జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులకే టికెట్లు ఇచ్చిన ప్రధాన పార్టీలు
  •  ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెరగనున్న బీసీ ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం

కరీంనగర్, వెలుగు:  ఉమ్మడి కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సిలర్లుగా, డివిజన్ కార్పొరేటర్లుగా బీసీలే అత్యధిక సంఖ్యలో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లాంటి ప్రధాన పార్టీలు జనరల్ స్థానాల్లోనూ  బీసీలనే బరిలో నిలిపాయి.

రిజర్వుడ్ స్థానాలతోపాటు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల సంఖ్యను లెక్కిస్తే 50 శాతం నుంచి 65 శాతం వరకు బీసీలే ఉండడం గమనార్హం. దీంతో మున్సిపాలిటీల్లో ఈ సారి బీసీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రాతినిథ్యం గణనీయంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

బీసీలకే జైకొట్టిన ప్రధాన పార్టీలు

మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు బీసీలకే జైకొట్టాయి. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 66 డివిజన్లలో 25 డివిజన్లు బీసీలకు రిజర్వ్ అయ్యాయి. ఇక్కడ బీజేపీ తరఫున 46 మంది బీసీలు పోటీలో ఉన్నారు. జనరల్ స్థానాల్లో 21 మంది బీసీలకు ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. కాంగ్రెస్ తరఫున 43 మంది, బీఆర్ఎస్ తరఫున 43 మంది బీసీ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. జనరల్ స్థానాలు పోనూ జనరల్ స్థానాల్లో ఆయా పార్టీల తరఫున 18 మంది చొప్పున టికెట్లు ఇచ్చాయి. 
    
రామగుండం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉండగా అందులో బీసీలకు 16 సీట్లు రిజర్వ్ అయ్యాయి. వీటితో కలిపి కాంగ్రెస్ బీసీలకు 36 సీట్లు, బీఆర్ఎస్ 38, బీజేపీ 34 సీట్లు కేటాయించాయి. జనరల్ కేటగిరీలోనూ కాంగ్రెస్ 20 సీట్లలో, బీఆర్ఎస్ 22 సీట్లలో, బీజేపీ 18 స్థానాల్లో బీసీలకు కేటాయించడం విశేషం.
    
చొప్పదండి మున్సిపాలిటీలోని 14 వార్డుల్లో బీజేపీ తరఫున 9 మంది, కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ ఏడుగురు బీసీలు పోటీలో ఉన్నారు. జమ్మికుంట 30 వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీ తరఫున 16 మంది చొప్పున బీసీలు పోటీలో ఉండగా, బీఆర్ఎస్ తరఫున 15 మంది పోటీలో ఉన్నారు. హుజూరాబాద్ లో 30 వార్డుల్లో కాంగ్రెస్, బీజేపీ 16 మంది చొప్పున, బీఆర్ఎస్ తరఫున 15 మంది బీసీలు పోటీలో ఉన్నారు. 
    
వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డుల్లో 14 స్థానాలు జనరల్‌‌‌‌‌‌‌‌కు  కేటాయించగా కాంగ్రెస్ 10 స్థానాలను, బీఆర్​ఎస్ 11, బీజేపీ 9 స్థానాలను బీసీలకు కేటాయించాయి. సిరిసిల్ల మున్సిపాలిటీలో 39 వార్డులు ఉండగా అందులో 13 జనరల్‌‌‌‌‌‌‌‌కు కేటాయించారు. వీటిలో కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 11 స్థానాల్లో బీసీలను బరిలో నిలిపారు.
    
జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులకు గానూ కాంగ్రెస్, బీజేపీ తరఫున 38 చోట్ల, బీఆర్ఎస్ 41 చోట్ల బీసీలు పోటీ చేస్తున్నారు. రాయికల్ మున్సిపాలిటీలో 12 వార్డుల్లో కాంగ్రెస్ ఐదుగురు, బీజేపీ, బీఆర్ఎస్ ఆరుగురు చొప్పున బీసీ అభ్యర్థులకు అవకాశమిచ్చాయి.

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మున్సిపాలిటీలోని 26 వార్డుల్లో కాంగ్రెస్ 19 మంది, బీజేపీ, బీఆర్ఎస్ 20 మంది చొప్పున బీసీ అభ్యర్థులను పోటీలో నిలిపాయి. కోరుట్ల మున్సిపాలిటీలో 33 వార్డులు ఉండగా.. కాంగ్రెస్, బీజేపీ తరఫున 19 మంది చొప్పున, బీఆర్ఎస్ తరఫున 16 మంది బీసీలు పోటీలో ఉన్నారు.