మున్సి పల్ పోరులో బీసీల హవా!.. నల్గొండ, రంగారెడ్డి జిల్లా ల్లో బీసీ అభ్యర్థుల సత్తా

మున్సి పల్ పోరులో బీసీల హవా!.. నల్గొండ, రంగారెడ్డి జిల్లా ల్లో బీసీ అభ్యర్థుల సత్తా
  • 2,995 వార్డుల్లో సగానికిపైగా బీసీవే
  •     1,480 జనరల్ స్థానాల్లో 400పైగా వారిదే గెలుపు 
  •     బీసీలకు రిజర్వ్ అయిన 970 స్థానాలూ వారివే.. 

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఫలితాల్లో బీసీ అభ్యర్థులు సత్తా చాటారు. తమకు కేటాయించిన రిజర్వేషన్ స్థానాలకే పరిమితం కాకుండా జనరల్ (అన్-రిజర్వ్‌‌‌‌డ్‌‌‌‌) స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేశారు. మొత్తం 2,995 వార్డులకు గాను.. దాదాపు సగానికి పైగా స్థానాల్లో బీసీలు కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా కొలువుదీరనున్నారు. ఈ ఎన్నికలో బీసీలకు సుమారు 973 స్థానాలు బీసీ రిజర్వ్ అయ్యాయి. ఇందులో బీసీ జనరల్, బీసీ మహిళా స్థానాలూ ఉన్నాయి. 

ఈ అన్ని స్థానాల్లో వంద శాతం బీసీలకే దక్కాయి. జనరల్ స్థానాల్లోనూ దాదాపు 1,480 ఉండగా.. ఇందులో 400కుపైగా స్థానాలను బీసీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సామాజిక సమీకరణాల్లో భాగంగా జనరల్ స్థానాల్లోనూ బీసీల్లో ప్రధానంగా గౌడ్‌‌‌‌, ముదిరాజ్, యాదవ, పద్మశాలి కులాలకు టికెట్లు కేటాయించాయి. దీంతో బీసీలు గెలిచిన స్థానాల సంఖ్య 1,373కు చేరింది. అంటే దాదాపుగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 46 శాతం మంది బీసీలే కావడం విశేషం. 

నల్గొండ, రంగారెడ్డిలో బీసీ ఆధిపత్యం

ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో బీసీ అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీల ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ, నల్గొండ మున్సిపాలిటీలతో పాటు దేవరకొండ, చిట్యాల వంటి మున్సిపాలిటీల్లో బీసీల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉంది. ప్రధానంగా మిర్యాలగూడ, నల్గొండ టౌన్లలో బీసీ మహిళా అభ్యర్థులు భారీగా గెలుపొందారు. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, షాద్‌‌‌‌నగర్, శంకర్ పల్లి, తుర్కయంజాల్ తదితర మున్సిపాలిటీల్లో బీసీలు గౌడ్, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందినవారు అధిక స్థానాలను దక్కించుకున్నారు. 

ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ బీసీ రిజర్వేషన్ల ద్వారా మెజారిటీ వార్డులను బీసీలే కైవసం చేసుకున్నారు. ఇక్కడ జనరల్ మహిళా స్థానాల్లోనూ బీసీ మహిళలు గెలుపొందారు. బీసీ (మహిళ), ఎస్సీ(మహిళ), ఎస్టీ(మహిళ) రిజర్వేషన్లే కాకుండా జనరల్ (మహిళ) కోటాలోనూ కొన్నిచోట్ల జనరల్ స్థానాల్లోనూ మహిళలు పోటీ చేసి గెలుపొందారు. 

దాదాపు 50 శాతానికి పైగా స్థానాల్లో మహిళలే జయకేతనం ఎగురవేశారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో చేనేత (పద్మశాలి), మున్నూరు కాపు సామాజిక వర్గాలు ఇక్కడ జనరల్ స్థానాల్లోనూ సత్తాచాటాయి. సిరిసిల్ల, వేములవాడలోనూ ఈ వర్గాలదే హవా నడిచింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మున్నూరు కాపు, ముదిరాజ్ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో జనరల్ సీట్లను గెలుచుకున్నారు. 

మహిళా కోటాలోనూ  బీసీల హవా

రాష్ట్రవ్యాప్తంగా 2,995 వార్డుల్లో 50 శాతం మహిళలకు రిజర్వ్ చేయగా.. బీసీ మహిళా కోటాతో పాటు జనరల్ మహిళా కోటాలోనూ బీసీ మహిళలే ఎక్కువగా గెలుపొందారు. వార్డు మెంబర్లు, కౌన్సిలర్లుగా భారీ సంఖ్యలో గెలుపొందడంతో జనరల్ కేటగిరీకి కేటాయించిన మున్సిపల్ చైర్మన్, మేయర్ పీఠాలను సైతం బీసీలే దక్కించుకునే అవకాశం లేకపోలేదు.970కి పైగా వార్డులు బీసీలకు (బీసీ- జనరల్, బీసీ -మహిళ) కేటాయించారు. అంతేకాకుండా, సుమారు 410 ఎస్సీలకు, 135 ఎస్టీలకు కేటాయించారు. జనరల్ స్థానాల్లో కూడా బీసీ సామాజికవర్గానికి చెందిన పలువురు అభ్యర్థులు ఇతర కులాలతో పోటీపడి గెలుపొందారు.