
- రాష్ట్ర రాజకీయాల వల్లే యువత, మేధావులు మా పార్టీలో చేరుతున్నరు
- బీజేపీలో చేరిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీసీల హక్కులను రక్షించేది బీజేపీ మాత్రమేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. సోమవారం ఆ పార్టీ స్టేట్ ఆఫీసులో ఎన్.రాంచందర్ రావు, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు వారు పార్టీ కండువా కప్పారు. అనంతరం రాంచందర్ రావు మాట్లాడుతూ.. కృష్ణమోహన్ చేరిక పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని చెప్పారు.
రాష్ట్ర రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని యువత, మేధావులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలో చేరుతున్నారన్నారు. కృష్ణమోహన్ చేరికతో బీసీలు, ఎంబీసీలు అందరూ బీజేపీతో ఉన్నారనే సంకేతం వెళ్లిందని వ్యాఖ్యానించారు. గతంలో ఎంబీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన తాడూరి శ్రీనివాస్ కూడా ఇప్పటికే బీజేపీలో చేరారని ఆయన గుర్తుచేశారు.
ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. యావత్ బీసీ సమాజం ప్రధాని మోదీ నాయకత్వంపై నమ్మకంతో ఉందని పేర్కొన్నారు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు. వకుళాభరణం, ఆర్.కృష్ణయ్య, తాడూరి శ్రీనివాస్ వంటి నాయకులు తమ పార్టీలో చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం ‘మసి పూసి మారేడుకాయ చేసి, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు’వ్యవహరించిందని ఎద్దేవా చేశారు. వకుళాభరణం కృష్ణమోహన్ మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం చేయగల ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావ్ పాటిల్, పాల్వాయి హరీశ్ బాబు, సూర్యనారాయణ గుప్తా, ఎంపీ ఆర్.కృష్ణయ్య, మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.