
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అడవుల సంరక్షణలో బీట్ అధికారులది కీలక పాత్ర అని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) సువర్ణ పేర్కొన్నారు. దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీలో 37వ బ్యాచ్ అటవీ సిబ్బంది కాన్వొకేషన్ మంగళవారం (సెప్టెంబర్ 30) ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి సువర్ణ ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పొందిన అభ్యర్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గ్రామీణుల సహకారంతో అడవులను కాపాడాలని పిలుపునిచ్చారు. అడవుల పరిరక్షణలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.
ఈ బ్యాచ్‌లో 80 మంది అభ్యర్థులు 6 నెలలు శిక్షణ పొందినట్టు అకాడమీ డైరెక్టర్ డా. ఆశా తెలిపారు. శిక్షణ పొందిన వారందరికీ ఉత్తీర్ణత సర్టిఫికెట్లు అందజేసినట్టు పేర్కొన్నారు.