20 ఏళ్ల కుర్ర క్రికెటర్.. ఐపీఎల్ వేలంలో సంచలనం.. రూ.14.2 కోట్లు పలికాడు

20 ఏళ్ల కుర్ర క్రికెటర్.. ఐపీఎల్ వేలంలో సంచలనం.. రూ.14.2 కోట్లు పలికాడు

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2026 మినీ వేలంలో సంచలనం నమోదైంది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన 20 ఏళ్ల కుర్ర క్రికెటర్ ప్రశాంత్ వీర్ కళ్లు చెదిరే ధర పలికాడు. రూ.14.2 కోట్ల భారీ ధరకు ప్రశాంత్ వీర్‎ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. తద్వారా వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా ప్రశాంత్ వీర్ రికార్డ్ సృష్టించాడు. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‎తో వేలంలోకి వచ్చిన ఈ ఆల్ రౌండర్‎ను దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. 

ముఖ్యంగా సీఎస్కే, ఎస్ఆర్‎హెచ్ పోటా పోటీగా ధర పెంచుకుంటూపోయాయి. రూ.14 కోట్ల దగ్గర హైదరాబాద్ వెనక్కి తగ్గగా.. రూ.14.2 కోట్లకు ప్రశాంత్ వీర్‎ను చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణించడం ద్వారా ప్రశాంత్ వీర్ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. ఈ క్రమంలోనే వేలంలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడుపోయాడు ఈ యువ క్రికెటర్. 

ఉత్తరప్రదేశ్‎కు చెందిన 20 ఏళ్ల ప్రశాంత్ వీర్ ఆల్ రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్‎తో పాటు హార్డ్ హిట్టింగ్ చేయగలడు.  టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలా ఆడగల సత్తా ఉంది. ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ షాట్లు కొట్టగలడు. ఇటీవల టీ20 ఫార్మాట్‎లో జరిగిన దేశవాళీ లీగ్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఒకే మ్యాచ్‌లో 10 బంతుల్లో 37 రన్స్ కొట్టి, 3 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు.

దీంతోనే ఈ ఆల్ రౌండర్‎పై ఐపీఎల్ ఫ్రాంచైజీలు కన్నేశాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్రశాంత్ వీర్‎ను కొనుగోలు చేసి రవీంద్ర జడేజా స్థానాన్ని భర్తీ చేయాలని ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే మినీ వేలంలో ఇతర ఫ్రాంచైజీలతో పోటీ పడి మరీ ప్రశాంత్ వీర్ ను రూ.14.2 కోట్ల భారీ ధరకు సీఎస్కే దక్కించుకుంది.