ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత అన్ క్యాప్డ్ ప్లేయర్ కార్తీక్ శర్మ చరిత్ర సృష్టించాడు. రూ.30 లక్షలతో ఆక్షన్ లోకి వచ్చి ఏకంగా 14.20 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాడు. మంగళవారం (డిసెంబర్ 16) జరుగుతున్న ఆక్షన్ ఈ 19 ఏళ్ళ కార్తీక్ శర్మను చెన్నై సూపర్ కింగ్స్ రూ.14.20 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అన్ క్యాప్డ్ ప్లేయర్ గా అత్యధిక ధర ప్లేయర్ గా ప్రశాంత్ వీర్ రూ.14.2 తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ఈ 19 ఏళ్ళ వికెట్ కీపర్ ను దక్కించుకునేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్.. చెన్నై సూపర్ కింగ్స్ కు గట్టి పోటీ ఇచ్చింది. చివరకు కార్తీక్ చెన్నై దగ్గరకే చేరాడు.
కార్తీక్ శర్మ పవర్ హిట్టింగ్ చేయడంలో సమర్ధుడు. వికెట్ కీపర్ కావడం కూడా కలిసొచ్చింది. క్లీన్ స్ట్రైకింగ్, పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ఆడుతూ రాజస్థాన్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 2006లో రాజస్థాన్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కార్తీక్ క్రికెట్ ప్రయాణం మొదట స్ట్రీట్ క్రికెట్‌లో ప్రారంభమై ఆ తర్వాత స్థానిక అకాడమీలో శిక్షణ తీసుకునే వరకు వెళ్ళింది. కోచ్‌లు అతని నైపుణ్యాన్ని గుర్తించి అతడి అభివృద్ధికి తోడ్పడ్డారు. తొలిసారి కార్తీక్ అండర్-14 క్రికెట్ లో రాజస్థాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఆ తర్వాత అండర్ -16 స్థాయిలో నిలకడగా రాణించి అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల నుండి పొందిన ప్రేరణ తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపాడు. 19 ఏళ్ల వయసులోనే కార్తీక్ ప్రతిభకు గుర్తింపు లభించింది. డొమెస్టిక్ క్రికెట్ లో 12 టీ20 మ్యాచ్ ల్లో 164 స్ట్రైక్ రేట్‌తో 334 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. 2024-25 సీజన్‌లో ఉత్తరాఖండ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ అరంగేట్రంలో 113 పరుగులు చేసి సెంచరీతో సత్తా చాటాడు. లిస్ట్ ఏ క్రికెట్‌లో 9 మ్యాచ్‌ల్లో 445 పరుగులతో సత్తా చాటాడు.
కార్తీక్ శర్మ కంటే ముందు రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కూడా కళ్లు చెదిరే ధర పలికాడు. రూ.14.2 కోట్ల భారీ ధరకు ప్రశాంత్ వీర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. తద్వారా వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ఆటగాడిగా ప్రశాంత్ వీర్ రికార్డ్ సృష్టించాడు. ఈ రికార్డ్ ను వెంటనే కార్తీక్ శర్మ సమం చేశాడు.
Yet another young one enters the den! 🦁🏟️
— Chennai Super Kings (@ChennaiIPL) December 16, 2025
Whistle welcome, Kartik Sharma!🥳#WhistlePodu #IPLAuction pic.twitter.com/1haBu8esPZ
