ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. మరోసారి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్

ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. మరోసారి పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: ఐబొమ్మ వెబ్‎సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవికి బిగ్ షాక్ తగిలింది. మూవీ పైరసీ కేసులో ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టు మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు కేసుల్లో మొత్తం 12 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఒక్కో కేసులో నాలుగు రోజులు విచారించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో 2025, డిసెంబర్ 18 నుంచి రవిని కస్టడీకి తీసుకొని విచారించనున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.  

కాగా, చిత్ర పరిశ్రమకు పెను సవాలుగా మారిన 'ఐబొమ్మ' పైరసీ వెబ్‌సైట్ కింగ్‌పిన్ ఇమ్మడి రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కూకట్‎పల్లిలో అదుపులోకి తీసుకుని కటకటాల్లోకి నెట్టారు. అనంతరం కోర్టు అనుమతితో రవిని కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. 

పోలీసుల విచారణలో రవి తన దందాను కేవలం పైరసీ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే కాకుండా.. అనేక అక్రమ కార్యకలాపాలు నిర్వహించినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీని వెనుక అంతర్జాతీయ లింకులు కూడా ఉన్నాయని తేలింది. రవి ఐబొమ్మతో పాటు 'బప్పం' (bappam.TV) పేరు మీద 17 ప్రధాన వెబ్‌సైట్‌లు, 65కు పైగా మిర్రర్ వెబ్‌సైట్‌లను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 

ఈ పైరసీ సామ్రాజ్యం ఎంత విస్తరించిందంటే.. ప్రతి నెలా సుమారు 3.7 మిలియన్ల యూజర్లు ఈ సైట్‌లలో లాగిన్ అవుతున్నారు. ఈ భారీ ట్రాఫిక్‌ను ఉపయోగించుకుని.. రవి తన ఆదాయాన్ని పెంచుకోవడానికి యూజర్లను ప్రముఖ గేమింగ్ బెట్టింగ్ సైట్‌లకు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ద్వారా రవి భారీగా అక్రమ ఆదాయాన్ని సంపాదించినట్లు తేల్చారు. 

ఈ క్రమంలోనే కేసుకు సంబంధించిన మరిన్నీ వివరాలు రాబట్టేందుకు రవిని మరోసారి పోలీసులు కస్టడీకి కోరారు. పోలీసుల అభ్యర్థనతో ఏకీభవించిన న్యాయస్థానం రవిని మరోసారి పోలీస్ కస్టడీకి అప్పగించేందుకు అనుమతించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా చెంచల్ గూడ జైల్లో ఉన్న రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని మరిన్నీ వివరాలు రాబట్టనున్నారు.