"చాలా కోపంగా ఉంది": బీహార్ సీఎంపై నటి ఫైర్, క్షమాపణ చెప్పాలని డిమాండ్..

"చాలా కోపంగా ఉంది": బీహార్  సీఎంపై  నటి ఫైర్, క్షమాపణ చెప్పాలని డిమాండ్..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ఒక ప్రభుత్వ కార్యక్రమంలో చేసిన పనికి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 'దంగల్' ఫేమ్ మాజీ బాలీవుడ్ నటి జైరా వసీం నితీష్ కుమార్‌ను విమర్శించారు.

పాట్నాలో జరిగిన ఆయుష్ డాక్టర్ల సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమంలో నితీష్ కుమార్ ఒక మహిళా వైద్యురాలికి సర్టిఫికెట్ ఇస్తున్నప్పుడు ఆమె హిజాబ్‌ను తొలగించమని సైగ చేశారు. ఆమె స్పందించకముందే నితీష్ కుమార్ ఆమె ముఖం నుండి హిజాబ్‌ను ఒక్కసారిగా లాగడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. 

ఈ క్లిప్‌పై స్పందించిన జైరా వసీం, Xలో  ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ఒక మహిళ  గౌరవం, వినయం ఆట వస్తువులు కావు. ముఖ్యంగా బహిరంగ వేదికపై ఇలా చేయడం దారుణం అని  పేర్కొన్నారు. ఒక ముస్లిం మహిళగా మరొక మహిళ నిఖాబ్‌ను అంత నిర్లక్ష్యంగా లాగడం చూస్తుంటే  చాలా కోపంగా ఉంది. అధికారం హద్దులను ఉల్లంఘించడానికి అనుమతించదని జైరా అన్నారు.

 ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆ మహిళకు క్షమాపణ చెప్పాలని  జైరా వసీం డిమాండ్ చేశారు. అయితే జైరా వసీం పోస్ట్‌కు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది.  ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ విమర్శించగా, ఆర్‌జేడీ (RJD) కూడా ముఖ్యమంత్రి ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే ఈ వైరల్ వీడియోపై బీహార్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. జైరా వసీం 2019లో హిందీ చలనచిత్ర పరిశ్రమను విడిచిపెట్టి మతం, గౌరవం వంటి అంశాలపై ఎక్కువగా మాట్లాడుతుంటారు.