ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఇద్దరు వెటరన్ విదేశీ ఫాస్ట్ బౌలర్లకు మంచి ధర పలికింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ కు జాక్ పాట్ ధర లభించింది. ముస్తాఫిజుర్ ను రూ. 9.2 కోట్లకు కోల్‌కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. ముస్తాఫిజుర్ కోసం కేకేఆర్ ఎక్కడా తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కేకేఆర్ ధాటికి వెనక్కి తగ్గక తప్పలేదు. ఇప్పటికే ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ను రూ. 25.20 కోట్లకు.. శ్రీలంక యార్కర్ల వీరుడు మతీషా పతిరానాకు రూ. 18 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసి బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకుంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ.2 కోట్లతో ఆక్షన్ లోకి వచ్చినా ముస్తాఫిజుర్ అన్ సోల్డ్ గానే మిగిలిపోయాడు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ప్లే ఆప్స్ ఆడాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ ప్లేస్‌లో బంగ్లాదేశ్ సీమర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. 2016లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముస్తాఫిజుర్ 2022, 2023లో డీసీకి ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ కెరీర్‌లో 38 మ్యాచ్‌లు ఆడిన ముస్తాఫిజుర్ 7.84 ఎకానమీతో 38 వికెట్లు తీశాడు. బంగ్లాదేశ్ తరఫున ముస్తాఫిజుర్ 106 టీ20ల్లో 132 వికెట్లు పడగొట్టాడు.
వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. హోల్డర్ ను రూ. 9.2 కోట్లకు గుజరాత్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ లో అన్ సోల్డ్ గా మిగిలిపోయిన ఈ విండీస్ ఆల్ రౌండర్ ఇటీవలే టీ20 క్రికెట్ లో అదరగొట్టాడు. వేలంలో చెన్నై గట్టి పోటీ ఇచ్చినా చివరికి గుజరాత్ హోల్డర్ ను తమ సొంతం చేసుకుంది. హోల్డర్ ఐపీఎల్ కెరీర్ లో 46 మ్యాచ్‌లు ఆడి 12.33 సగటుతో 259 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 27.57 సగటుతో 53 వికెట్లు తీసుకున్నాడు.
ఈ కరేబియన్ ఆల్ రౌండర్ 2013లో చెన్నై సూపర్ కింగ్స్, 2014, 2020, 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్, 2016లో కోల్‌కతా నైట్ రైడర్స్, 2022లో లక్నో సూపర్ జెయింట్స్, 2023లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన అనుభవం ఉంది.
